మాస్కో: ఉక్రెయిన్‌పై దాడి చేయబోయి దేశంలోని సొంత గ్రామంపైనే రష్యా ప్రమాదవశాత్తు బాంబులు వేసుకుంది. ఈ విషయాన్ని ఆ దేశ ఆర్మీ నిర్ధారించింది. మంగళవారం(జనవరి 2) ఉదయం తొమ్మిది గంటలకు రష్యా దక్షిణాన ఉన్న వొరొనెజ్ ప్రాంతంలోని ఓ గ్రామంపై రష్యా సైన్యం బాంబులు వేసింది. అయితే ఈ బాంబు దాడుల్లో ఎవరూ చనిపోలేదు. దాడుల్లో 6 ఇళ్లు మాత్రం దెబ్బతిన్నట్లు రష్యా మీడియా రిపోర్టు చేసింది.
‘బాంబు దాడి ఘటనపై విచారణ ఇప్పటికే ప్రారంభమైంది. బాంబు దాడిలో జరిగిన నష్టంపై అంచనాకు ఒక కమిషన్ వేశాం. బాంబు దాడులు జరిగిన ప్రాంతం నుంచి కొంత మందిని వేరే చోటికి తరలించాం’ అని వొరొనెజ్ ప్రాంత గవర్నర్ ఓల్గా స్కబెయెవా తెలిపారు. అంతకు ముందు ఈ దాడిపై గవర్నర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టులను తొలగించారు. ఈ దాడులు ఉక్రెయిన్ ఉగ్రవాదుల పనేనని ఆమె తన పోస్టుల్లో పేర్కొంది. అయితే బాంబులు వేసింది రష్యా సైన్యమేనని నిర్ధారణ అయిన తర్వాత ఆమె పోస్టులను తొలగించారు.
కొంత కాలం నుంచి కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా ఉక్రెయిన్‌లోని నగరాలపై రష్యా తాజాగా బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో అయిదుగురు చనిపోగా 100 మంది దాకా గాయపడ్డారు.ఈ బాంబు దాడుల్లో భాగంగానే రష్యా తన సొంత ప్రాంతంపై తానే బాంబులు వేసుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment