ప్రత్యర్థుల అణచివేతకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎందాక అయినా వెళ్తారని కళ్లారా చూస్తున్నదే!. నావల్నీ మరణం.. అందుకు ఒక ఉదాహరణ. తాజాగా చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్Garry Kasparovను రష్యా ఉగ్రవాదుల జాబితాలో చేర్చడం.. ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. పుతిన్ ప్రభుత్వంపై ఆయన బహిరంగంగా విమర్శలు గుప్పించడమే అందుకు ప్రధాన కారణమని ఇక్కడ చెప్పనక్కర్లేదు. అసలు 'ఉగ్రవాదులు, తీవ్రవాదులు' లిస్టులో చేరడానికి రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఎలాంటి విధానాలు పాటిస్తోంది?..
ఉగ్రవాదులు-అతివాదుల జాబితాలో చేరడానికి ప్రత్యేకించి అర్హతలేమీ అక్కర్లేదు. పుతిన్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే చాలూ. ఇలాగే ఇప్పుడు కాస్పరోవ్ పేరును తీవ్రవాదులు-ఉగ్రవాదుల జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను సైతం ఈ చెస్ మాజీ ఛాంపియన్ బహిరంగంగానూ ఖండిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రోస్‌ఫిన్‌మానిటరింగ్ (రష్యా ఆర్థిక పర్యవేక్షణా సంస్థ) విడుదల చేసిన ఉగ్రవాదుల జాబితాలోకి గ్యారీ కాస్పరోవ్ పేరు చేరింది.
గ్యారీ కాస్పరోవ్ ప్రభుత్వ అణచివేత విధానాలకు భయపడి 2014లోనే ఆయన రష్యా నుంచి వెళ్లిపోయారు. పదేళ్లుగా అమెరికాలోనే ఉంటున్నారు. 2022లో రష్యా న్యాయశాఖ ఆయనపై విదేశీ ఏజెంట్ అనే ముద్ర కూడా వేసింది. తాజాగా.. ఈ జాబితాలో ఆయన పేరును చేర్చడం వల్ల ఆయన ఆర్థిక లావాదేవీలపై తీవ్ర ఆంక్షల్ని విధించేందుకు రష్యాకు అవకాశం ఉంటుంది.
కాగా, గ్యారీ కాస్పరోవ్‌పై పుతిన్ సర్కార్ తీసుకున్న చర్యలను హక్కుల సంఘాలు తప్పుబడుతున్నాయి. అణచివేతకు ఈ ఆంక్షలను రష్యా ప్రభుత్వం ఆయుధంగా ఉపయోగిస్తుందని మండిపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment