బాంబు దాడితో మరియుపోల్‌లోని ఓ భవనం నుంచి వెలువడుతున్న పొగలు
లెవివ్: ఉక్రెయిన్‌లోని మరియూపోల్, వోల్నోవఖా నగరాల నుంచి సాధారణ పౌరులు క్షేమంగా బయటకు వెళ్లేందుకు వీలుగా శనివారం దాదాపు ఐదున్నర గంటలపాటు పరిమిత స్థాయిలో కాల్పుల విరమణకు రష్యా అంగీకరించడం కీలక పరిణామంగా నిపుణులు భావించారు. రష్యా కొంత దిగి వస్తున్నట్లుగా అంచనా వేశారు. అయితే, కాల్పుల విరమణ హామీని రష్యా నిలబెట్టుకోలేదని ఉక్రెయిన్ ఆరోపించింది. మరియూపోల్, వోల్నోవఖా నగరాలపై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపించిందని, ఫలితంగా పౌరుల చేరవేత సాధ్యం కాలేదని ఉక్రెయిన్ తెలిపింది.
కాల్పుల విరమణకు రష్యా కట్టుబడి ఉండలేదని, మరియూపోల్‌తోపాటు పరిసర ప్రాంతాలపై దాడులు యథాతథంగా కొనసాగించిందని, బయటకు వెళ్లాల్సిన పౌరులు అండర్‌గ్రౌండ్ స్టేషన్లలోనే తలదాచుకోవాల్సి వచ్చిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కార్యాలయ ప్రతినిధి కైరీలో టైమోషెంకో తెలిపారు. కాల్పుల విరమణ పాటించాలని కోరుతూ రష్యాతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. పౌరుల భద్రత దృష్ట్యా మరియూపోల్, వోల్నోవఖా నగరాల్లో కాల్పుల విరమణకు అంగీకరిస్తూ తొలుత రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. పౌరులు వెళ్లే మార్గాల్లో ఎలాంటి దాడులు జరుపబోమని హామీ ఇచ్చింది. దీంతో ఉక్రెయిన్ అధికారుల్లో ఆశలు చిగురించాయి.
రెండు నగరాల నుంచి పౌరులను తరలించడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు తెలిసింది. రష్యా సైన్యం మాట తప్పడంతో తరలింపు ప్రక్రియ నిలిపివేయక తప్పలేదని ఉక్రెయిన్ పేర్కొంది. దాడులు ఆపాలని రష్యాను కోరుతున్నట్లు ఉక్రెయిన్ ఉప ప్రధానమంత్రి ఇరీనా వెరెషుక్ చెప్పారు. మరియూపోల్, వోల్నోవఖా సిటీల్లో ఉన్న తమ సేనలకు వ్యతిరేకంగా దాడులు జరిగాయని రష్యా రక్షణ శాఖ ఆరోపించింది. అందుకే ప్రతిదాడులు చేశామన్న సంకేతాలను పరోక్షంగా ఇచ్చింది. కాల్పుల విరమణ అనేది చివరకు వృథా ప్రయాసగానే మిగిలిపోవడం ఉక్రెయిన్‌ను నిరాశపర్చింది. ఈ ఒప్పందం అమలయ్యేలా తమ వైపు నుంచి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు.
జనం ఆకలి కేకలు
మరియూపోల్‌లో పరిస్థితులు దిగజారుతున్నాయి. గడ్డకట్టించే చలిలో వేలాది మంది ప్రజలు నానా కష్టాలూ పడుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మొబైల్‌ఫోన్లు పనిచేయడం లేదు. ఆహారం, మంచినీటి కొరత వేధిస్తోంది. ఫార్మసీల్లో ఔషధాలు దొరకడం లేదు. బయటకు వెళ్లిపోవడానికి వేలాది మంది సిద్ధమయ్యారని, ఇంతలో రష్యా దాడులు ప్రారంభించడంతో వారంతా ఆగిపోయారని మరియూపోల్ మేయర్ చెప్పారు. ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టలేమని, అందుకే తరలింపు ఆపేశామని తెలిపారు. మరియూపోల్‌లో 2 లక్షలు, వోల్నోవఖాలో 20 వేల మంది ఉన్నట్లు అంచనా.
Comments
Please login to add a commentAdd a comment