Russia Ukraine War Day 11: Latest Updates In Telugu - Sakshi
Sakshi News home page

Russia-Ukraine War: ఉక్రెయిన్‌లో నెత్తురు, కన్నీటి నదులు పారుతున్నాయి..

Published Sun, Mar 6 2022 7:37 AM | Last Updated on Sun, Mar 6 2022 8:41 PM

Russia Ukraine War Telugu Latest Updates Day 11 - Sakshi

Russia-Ukraine War Day 11 LIVE Updates: ఉక్రెయిన్‌పై రష్యా బలగాల దాడులు 11వ రోజుకు చేరుకున్నాయి. రష్యా సైన్యం వైమానిక దాడులను జెట్‌స్పీడ్‌ వేగంతో కొనసాగిస్తోంది. మరోవైపు రష్యాపై ఆంక్షలు విధించడం యుద్ధంతో సమానమని పుతిన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు నాటో దేశాలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. దాడులు కొనసాగుతుండగానే సోమవారం(మార్చి 7వ తేదీన) రెండు దేశాల మధ్య మూడోసారి శాంతి చర్చలు జరుగనున్నాయి.  

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు కోసం ఏర్పాటుచేసిన మిషన్‌ గంగా మిషన్‌ ద్వారా ఇప్పటి వరకు 76 విమానాల్లో 15,920 మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి చేర్చినట్లు కేంద్రమంత్రి జ్యోతిరాధిత్యా సింధియా తెలిపారు.

♦రోమేనియా నుంచి 31 విమనాల్లో 6680 మంది విద్యార్థులు
♦పోలాండ్‌ నుంచి 13 విమానాల ద్వారా 2822 మంది విద్యార్థులు
♦హంగేరి నుంచి 26 విమానాల్లో 5300 మంది విద్యార్థులు
♦స్లోవేకియా నుంచి 6 విమానాల్లో 1118 మందిని భారత్‌కు తరలించినట్లు తెలిపారు.

► ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో గాయపడిన భారతీయ విద్యార్థి హర్జోత్‌ సింగ్‌ను సోమవారం స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. వీకే సింగ్‌ తెలిపారు. కీవ్ నుంచి ఉక్రెయిన్ సరిహద్దు వైపు ప్రయాణిస్తుండగా అతడిపై కాల్పులు జరిగాయి.  గాయపడిన హర్జోత్‌ తన పాస్‌పోర్టు పోగొట్టుకున్నాడని, సోమవారం తమతో పాటు భారత్‌కు తీసుకురానున్నట్లు  పోలాండ్‌లో ఉన్న కేంద్ర మంత్రి జనరల్‌ వీకే సింగ్‌ ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు. 

ఉక్రెయిన్‌ ఎయిర్‌స్పేస్‌ను నోఫ్లై జోన్‌గా ప్రకటించాలని విదేశాలకు  అ దేశ అధ్యక్షుడు వోలోదిమిర్‌ జెలెన్‌స్కీ మరోసారి వి‍జ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్‌లోని ఎయిర్‌పోర్టులపై రష్యా బాంబు దాడులు చేస్తోందని, దాడుల కట్టడికి ఉక్రెయిన్‌ గగనతలాన్ని నో ఫ్లైజోన్‌గా ప్రకటించాలని అమెరికాతో సహా యూరోపియన్‌ దేశాలను కోరారు. 

ఉక్రెయిన్‌లో రష్యా మిలటరీ దాడులపై పోప్‌ ఫ్రాన్సిస్‌ స్పందించారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో రక్తపు, కన్నీటి నదులు పారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, మరణం, విధ్వంసం, దుఃఖాన్ని నాటుతోన్న యుద్ధమని విచారం వ్యక్త చేశారు.  ఉక్రెయిన్‌ సంక్షోభ సమయంలో శరణార్థుల కోసం మానవతా కారిడార్‌లను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. 

ఉక్రెయిన్‌లోని ఆరోగ్య సంరక్షణ కేంద్రాలపై దాడులను ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించింది. ఆరోగ్య కేంద్రాలపై దాడి ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు, 11 మంది గాయాలపాలైనట్లు తెలిపింది. ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, హెల్త్‌ వర్కర్లపై దాడులు అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘించినట్లేనని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఆదివారం ట్విట్టర్‌లో తెలిపారు. 

ఉక్రెయిన్ ఓడరేవు నగరం ఒడెస్సాపై రష్యా దళాలు బాంబు దాడికి సిద్ధమవుతున్నాయని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు.

ఉక్రెయిన్‌ పొరుగు దేశాల నుంచి గడిచిన 24 గంటల్లో 2100 భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు పౌర  విమానయానశాఖ తెలిపింది.  సోమవారం రోజు 8 విమానాల(బుడాపెస్ట్‌(5) సుసీవా(2) బుచారెస్ట్‌(1)) ద్వారా మరో 1500 మంది భారతీయులను స్వదేశానికి తీసుకురానున్నట్లు వెల్లడించింది.  

ఫిబ్రవరి 22న ప్రారంభించిన ప్రత్యేక విమానాల ద్వారా ఇప్పటి వరకు 15,900 మంది విద్యార్థులను ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. 

ఉక్రెయిన్‌ చిక్కుకుపోయిన భారతీయులను ఆపరేషన్‌ గంగా’ మిషన్‌ ద్వారా సరిహద్దు దేశాలైన పోలండ్‌, హంగరీ, రొమేనియా, స్లోవేకియా నుంచి స్వదేశానికి తరలిస్తున్న విషయం తెలిసిందే. కాగా హంగేరిలో ఆపరేషన్‌ గంగా కార్యక్రమం ముగింపు దశకు చేరుకుందని. నేడు చివరి విమానాలు బయల్దేరనున్నట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం ఆదివారం వెల్లడించింది.  ఎంబసీ ఏర్పాటు బస కాకుండా స్వతహాగా వేరే చోట్ల ఉన్న వారందరూ వెంటనే బుడాపెస్ట్‌కు చేరుకోవాలని సూచించింది.

ఉక్రెయిన్‌లో యుద్ధం నేపథ్యంలో గత పది రోజుల్లో లక్షాలాది మంది శరణార్ధులుగా మారిపోయారు. ఇప్పటివరకు 15 లక్షల మంది ప్రజలు దేశం విడిచి పొరుగు దేశాలకు వెళ్లినట్లు ఐరాస వెల్లడించింది, రెండో ప్రపంచ యుద్ధం తరువాత యూరప్‌లో అతి తక్కువ కాలంలో అత్యంత వేగంగా పెరుగుతున్నశరనార్ధుల సంక్షోభం ఇదేనని తెలిపింది. 

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపును సమన్వయం చేసేందుకు హంగేరీలోని బుడాపెస్ట్‌లో భారత రాయబార కార్యాలయం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.

ఉక్రెయిన్‌ నుంచి తమ పౌరులను తరలించడంలో పెద్ద పెద్ద దేశాలే ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ తాము భారతీయులను విజయవంతంగా తీసుకురాగులుగుతున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు. కోవిడ్‌ను విజయవంతంగా కంట్రోల్‌ చేశామని, ఇప్పుడు ఉక్రెయిన్‌ నుంచి తమ ప్రజలను సురక్షితంగా తరలిస్తున్నామని పేర్కొన్నారు. ఇదంతా భారత్‌కు పెరుగుతున్న ఆదరణ వల్లే సాధ్యమైందన్నారు. పెద్ద దేశాలు కూడా ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నాయని అన్నారు.  ఈ మేరకు పుణె యూనివర్సిటీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

రష్యా మిలటరీ దాడి మొదలైనప్పటి నుంచి నేటి వరకు 11 వేల మంది ఆ దేశ సైనికులు మృతి చెందారని ఉక్రెయిన్‌ ఆర్మీ అధికారులు ఆదివారం వెల్లడించారు  అలాగే 44 విమనాలు, 48 హెలికాప్టర్లు, 285 ట్యాంక్‌లు, 109 ఆర్టిలరీ ఆయుధాలను ద్వంసం చేసినట్లు పేర్కొన్నారు.

తనను సజీవంగా చూడడం ఇదే చివరిసారి కావచ్చని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవే తన చివరి మాటలు కావొచ్చంటూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. ఆక్రమణదారుల నుంచి తమ దేశాన్ని కాపాడుకుంటామని అన్నారు. తమ మాతృభూమిని కాపాడుకునేందుకు ఉక్రెయిన్‌ ప్రజలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నారని ప్రశంసించారు.

ఇప్పటికీ ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులకు అక్కడి భారతీయ రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. వెంటనే ఓ ఫామ్‌లో వివరాలు నమోదు చేయాలని పేర్కొంది. పేరు, ఉక్రెయిన్‌లో ఏ నగరంలో ఉన్నారు.. వంటి అంశాలతో కూడిన ఓ దరఖాస్తును అత్యవసర ప్రాతిపదికన నింపాలంటూ సూచించింది. ఇందకు ఓ గూగుల్‌ డాక్యుమెంట్‌ను జతచేసింది.

ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం మొదలు పెట్టినప్పటి నుంచి మార్చి 4 వరకు జరిగిన దాడుల్లో కనీసం 351  మంది పౌరులు మృతి చెందినట్లు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం వెల్లడించింది. మృతుల్లో 22 మంది చిన్నారులు ఉన్నట్లు తెలిపింది. మరోవైపు 707 మంది గాయపడ్డారని, అందులోనూ 36 మంది పిల్లలు ఉన్నట్లు పేర్కొంది. అయితే వాప్తవ లెక్కలు ఇంకా ఎక్కువే ఉండవచ్చని అభిప్రాయపడింది. 

భారత్‌ ప్రయోజానాల దృష్ట్యా యుద్ధం ఆపమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌కి చెప్పండి అని ఉక్రెయిన్‌ భారత ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థించింది. ఈ మేరకు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించాలని రష్యాను కోరండి అని ప్రధాని మోదీకి పిలుపునిచ్చారు. ఇది అన్ని దేశాల ఉత్తమ ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు.

► ఉక్రెయిన్‌లో వైమానిక స్థావరం ధ్వంసం 
ఉక్రెయిన్‌లో రష్యా వైమానిక దాడులను తీవ్రతరం చేసింది. ఆదివారం ఉక్రెయిన్‌లోని స్టారోకోస్టియాంటినివ్‌ వైమానిక స్థావరం లక్ష్యంగా రష్యా దాడులు చేసింది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌కు చెందిన స్టారోకోస్టియాంటినివ్‌ స్థావరం పూర్తిగా ధ్వంసమైంది. 

► ఉక్రెయిన్‌లోని జైటోమిర్ ప్రాంతంలో నాలుగు Su-27, ఒక MiG-29 విమానాలను, రాడోమిషాల్ ప్రాంతంలో ఒక Su-27, Su-25, ఒక Su-25 విమానాలను రష్యా గత ఒక్కరోజులో కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిజిన్ ప్రాంతంలో మరో విమానంను కాల్చినట్లుగా తెలుస్తోంది.

► 2,203 మిలిటరీ కేంద్రాలు ధ్వంసం: రష్యా రక్షణ శాఖ
ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు బాంబులు, క్షిపణి ప‍్రయోగాలతో బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు ఉక్రెయిన్‌కు చెందిన 2,203 మిలిటరీ మౌళిక సదుపాయాల కేంద్రాలను ధ్వంసం చేసినట్టు రష్యా రక్షణ శాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. 

► మెట్రో స్టేషన్ సమీపంలో క్షిపణి దాడిలో ఉక్రెయిన్‌ పౌరుడు మృతి 
ఉక్రెయిన్‌లో రష్యా బలగాల దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం రష్యా ట్రూప్స్‌ జైటోమిర్‌ ప్రాంతంలోని మెట్రో స్టేషన్‌ సమీపంలో క్షిపణి దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఉక్రేనియన్‌ పౌరుడు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. 

► భారత్‌ చేరుకున్న మరో 210 మంది విద్యార్థులు
ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆపరేషన్‌ గంగా కొనసాగుతోంది. ఉక్రెయిన్‌ నుంచి భారత విద్యార్థులను స్వదేశానికి తరలిస్తున్నారు. కాగా, ఆదివారం ఉదయం ఉక్రెయిన్‌ నుంచి 210 మంది భారత విద్యార్థులు ఇండియాకు చేరుకున్నారు. భారత వైమానిక దళ విమానం రొమేనియాలోని బుకారెస్ట్‌ నుంచి విద్యార్థులను ఢిల్లీ సమీపంలోని హిండన్‌ బేస్‌ను తరలించింది. 

► రష్యాకు మరో షాక్‌.. వీసా, మాస్టర్‌ కార్డ్‌ సేవలు బంద్‌
ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికన్‌ పేమెంట్‌ సంస్థలైన వీసా, మాస్టర్​కార్డ్​.. రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తున్నామని వీసా సీఈవో అల్‌ కెల్లీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో రష్యాలో వీసా కార్డు సేవలను పూర్తి స్థాయిలో నిలిపివేస్తామని ఆయన వెల్లడించారు. 

రష్యా హెలికాప్టర్‌ను కూల్చేశాం: ఉక్రెయిన్‌ రక్షణశాఖ
తమ వైమానిక రక్షణ దళ నిపుణులు రష్యా హెలికాప్టర్‌ను శనివారం కూల్చేశారని ఉక్రెయిన్‌ రక్షణ శాఖ ట్విట్టర్‌లో వెల్లడించింది. చెర్నిహివ్‌ నగర శివారులో ఈ సంఘటన జరిగిందని పేర్కొంది. రష్యా హెలికాప్టర్‌లో ఒక పైలట్‌ మరణించాడని, అతడిని మేజర్‌ క్రివోలాపోవ్‌గా గుర్తించినట్లు తెలిపింది.

బైడెన్‌కు జెలెన్‌ స్కీ ఫోన్‌.. 
► ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ మరోసారి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో రెండో సారి ఫోన్‌లో మాట్లాడారు. ఈ క్రమంలో ఉక్రెయిన్​కు రక్షణ, ఆర్థిక మద్దతు, రష్యాపై ఆంక్షల కొనసాగింపు వంటి కీలక అంశాలపై చర్చించినట్టు జెలెన్‌ స్కీ పేర్కొన్నారు. 

పుతిన్‌తో ఇజ్రాయెల్‌ ప్రధాని భేటీ..
► దాడుల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఇజ్రాయెల్‌ ప్రధాని నఫ్తాలి బెన్నెట్‌ భేటీ అయ్యారు. క్రెమ్లిన్‌లో వీరిద్దరి మధ్య జరిగిన భేటీలో ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు చేపట్టాలని పుతిన్‌ను కోరినట్టు సమాచారం. మరోవైపు కీవ్‌, మాస్కోలతో ఇజ్రాయెల్‌తో కీలక సంబంధాలు ఉన్న కారణంగా ఉక్రెయిన్‌ చర్చల కోసం ఆ దేశాన్ని ఆశ్రయించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement