ప్రమాదకరంగా మారిన చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్ నుంచి రష్యా సేనలు వైదొలిగాయని ఉక్రెయిన్ ప్రభుత్వ విద్యుత్ సంస్థ ఎనెర్గోఆటం తెలిపింది. ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 24వ తేదీ నుంచి యుద్ధం ప్రారంభించిన రష్యా సేనలు చెర్నోబిల్‌ను స్వాధీనం చేసుకోవడంతో ప్రపంచ నేతలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 1986 నుంచి మూసివేసి ఉన్న ఈ ప్లాంట్ వెలుపల తవ్విన గుంతల నుంచి ప్రమాదకర స్థాయిలో అణుధార్మికత వెలువడటంతో ఆ ప్రాంతం నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా సేనలు తెలిపాయని ఎనెర్గోఆటం పేర్కొంది.
చెర్నోబిల్‌కు సంబంధించి తాజాగా తమకు ఎటువంటి సమాచారం అందలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తెలిపింది. త్వరలోనే ఆ ప్రాంతాన్ని సందర్శిస్తామని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రోస్సి తెలిపారు. మారియుపోల్ నగరంపై రష్యా దాడులు తీవ్రతరమయ్యాయి. నగరంలో చిక్కుకుపోయిన పౌరులను తీసుకు వచ్చేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం పంపించిన 45 బస్సుల కాన్వాయ్‌ను రష్యా ఆర్మీ అడ్డుకుంది. మారియుపోల్‌లో పౌరుల కోసం 14 టన్నుల ఆహారం, మందులతో వెళ్లిన వాహనాలను కూడా రష్యా సైన్యం అడ్డుకున్నట్లు సమాచారం. బెల్గోరాడ్ ప్రాంతంపై ఉక్రెయిన్ హెలికాప్టర్ గన్‌షిప్పులు దాడి చేయడంతో చమురు డిపో మంటల్లో చిక్కుకుందని ఆ ప్రాంత గవర్నర్ ఆరోపించారు.
ఉక్రెయిన్–రష్యా చర్చలు పునఃప్రారంభం
ఉక్రెయిన్–రష్యా మధ్య శాంతి చర్చలు వీడియో లింక్ ద్వారా శుక్రవారం పునఃప్రారంభమయ్యా యి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కార్యాలయం సైతం ధ్రువీకరించింది. ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చివరిసారిగా మూడు రోజుల క్రితం టర్కీలో చర్చలు జరిగాయి. డోన్బాస్, క్రిమియాపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చర్చల్లో రష్యా ప్రతినిధి మెడిన్‌స్కీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment