వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డొనాల్డ్ ట్రంప్‌పై మరోమారు హత్యాయత్నం జరిగింది. గోల్ఫ్ క్లబ్ వెలుపల ట్రంప్‌పై కాల్పులు జరిపిన నిందితుడు ర్యాన్ వెస్లీ రౌత్‌ను ఏకే-47 ఆయుధంతో సహా ఎఫ్‌బీఐ అదుపులోకి తీసుకుంది.
ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ర్యాన్ వెస్లీ రౌత్ కాల్పులు జరిపాడు . దీనిని గమనించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ సభ్యుడు రైఫిల్‌తో ఎదురు కాల్పులు జరిపాడు. దీంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అయితే అనుమానిత షూటర్ వాహనం, లైసెన్స్ ప్లేట్ ఫోటోను సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ సేకరించాడు. ఇది దర్యాప్తునకు ఉపకరించింది. రెండు నెలల్లో రెండోసారి ట్రంప్‌పై హత్యాయత్నం జరగడం గమనార్హం.
తాజాగా ట్రంప్‌పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు 58 ఏళ్ల ర్యాన్ వెస్లీ రౌత్‌గా గుర్తించారు. నార్త్ కరోలినాలో ఉంటున్న రౌత్ సుదీర్ఘ నేర చరిత్రను కలిగినవాడని పోలీసులు గుర్తించారు. ఎఫ్‌బీఐ ఇతనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించనప్పటికీ.. న్యూయార్క్ పోస్ట్ పలు వివరాలను అందించింది. లింక్డ్‌ఇన్‌ను ఆధారంగా చేసుకుని నిందితుడు నార్త్ కరోలినా అగ్రికల్చరల్ అండ్ టెక్నికల్ స్టేట్ యూనివర్శిటీలో చదువుకున్నాడని, 2018లో హవాయికి షిఫ్ట్ అయ్యాడని తెలిపింది.
లింక్డ్‌ఇన్‌లో రౌత్ తన అభిరుచులు, ఆలోచనలు పంచుకున్నాడని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. నార్త్ కరోలినా డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడల్ట్ కరెక్షన్స్‌లో రౌత్‌కు సంబంధించిన రికార్డులు 2002 నుంచి ఉన్నాయి. 2003లో లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం, ఆయుధాలు కలిగి ఉండటం, హిట్ అండ్ రన్ కేసులలో రౌత్‌కు శిక్ష పడింది. 2010లో అతనిపై చోరీ కేసు నమోదయ్యింది. అమెరికా రాజకీయాల గురించి రౌత్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలు రాసేవాడు.
రౌత్ 2019లో డెమోక్రటిక్ అభ్యర్థులకు విరాళాలు అందించాడు. 2022 ఏప్రిల్‌లో ఒక పోస్టులో అతను ట్రంప్‌ను విమర్శించాడు. అమెరికాను ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛగా ఉంచడంపై తన ప్రచారాన్ని కేంద్రీకరించాలని అధ్యక్షుడు జో బైడెన్‌కు రౌత్ సలహా ఇచ్చాడు. అమెరికన్లను బానిసలుగా చేయాలని ట్రంప్ భావిస్తున్నారని రౌత్ విమర్శించాడు.
పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన తర్వాత రౌత్ అధ్యక్షుడు బైడెన్‌ను సలహా ఇచ్చాడు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించాలని, మరణించిన అగ్నిమాపక సిబ్బంది అంత్యక్రియలకు హాజరు కావాలని బైడెన్‌ను కోరాడు. రౌత్ గత జూలై 16న ఈ పోస్ట్ చేశాడు. నిజమైన నాయకులు ఏమి చేస్తారో ప్రపంచానికి చూపించాలని బైడెన్‌కు రౌత్ సూచించాడు.
ఇది కూడా చదవండి: ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం?
Comments
Please login to add a commentAdd a comment