తిమోతీ సమాధి చిత్రం (ఫోటో కర్టెసీ: ఇండియా.కామ్ సైట్)
వాషింగ్టన్: ఇటీవల కాలంలో కొన్ని సార్లు స్మశానానికి చేరుకున్న తర్వాతో, అంత్యక్రియలు జరుగుతున్నప్పుడో సడెన్‌గా మృతదేహాలు లేచి కూర్చుంటున్న ఘటనలు చూశాం. బతికున్న వ్యక్తులను కూడా చనిపోయారని వైద్యులు చెప్పడం వల్లే ఇలా జరుగుతోంది. అయితే ఇలాంటి సంఘటనను ఓ వ్యక్తి వందల ఏళ్ల క్రితమే ఊహించాడు. ఒకవేళ తనను బతికుండానే సమాధి చేస్తే.. ఆ తర్వాత తనకు స్పృహ వస్తే.. ఏంటి పరిస్థితి అని ఆలోచించాడు. ఒకవేళ ఇదే జరిగితే తాను చావలేదని ప్రపంచానికి తెలపడం కోసం ఓ ఆలోచన చేశాడు. దానిలో భాగంగా మరణించడానికి ముందే సమాధి కట్టించుకున్నాడు. దానికి ప్రత్యేకంగా కిటికీ, గంట కూడా పెట్టించుకున్నాడు. చదవడానికి.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
అమెరికాలోని వెర్మాంట్‌కు చెందిన డాక్టర్ తిమోతీ క్లార్క్ స్మిత్ అనే వ్యక్తి.. ముందు చూపుతో తన సమాధి తానే కట్టించుకున్నాడు. దానికి ప్రత్యేకంగా ఒక కిటికీ, గంటను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఒక వేళ బతికుండగానే తనని ఖననం చేస్తే.. అవి పనికొస్తాయని, ప్రాణాలతో ఉంటే ఆ గంటను కొట్టి బయట ఉన్న వ్యక్తులను అప్రమత్తం చేయవచ్చనేది అతడి ఆలోచన. అయితే ఈ ఘటన ఇప్పుడు జరిగింది కాదు. 18వ శతాబ్దంలో చోటు చేసుకుంది.
మరణించడానికి ముందే సమాధిని ఏర్పాటు చేసుకున్న డాక్టర్ తిమోతీ 1893లోనే చనిపోయాడు. ఆ సమాధిలోనే తిమోతీని ఖననం చేశారు. వందల ఏళ్లు గడుస్తున్నప్పటికి ఆ సమాధి ఇప్పటికి ఇంకా చెక్కుచెదరలేదు. పైగా, ఇది ప్రముఖ పర్యాటక కేంద్రంగా వెలుగొందుతుంది. వందల ఏళ్ల క్రితం నాటి ఈ విషయం ఓ టిక్‌టాక్ యూజర్ వల్ల మరోసారి తెర మీదకు వచ్చింది. ఈ విషయాన్ని బాబీకర్టిస్లీ(@bobbiecurtislee) అనే టిక్‌టాక్ యూజర్ ఈ వింత సమాధి గురించి వివరించింది. ‘‘తిమోతీ మరణానికి ముందు తన సమాధికి సంబంధించిన మోడల్ తయారు చేయించుకున్నాడు. దీనికి ప్రత్యేకంగా పేటెంట్ కూడా తీసుకున్నాడు. మరణించకుండానే తనని ఖననం చేస్తే అప్పుడు సమాధికి ఏర్పాటు చేసిన బెల్, కిటికీలు ఉపయోగపడతాయనేది అతడి ఉద్దేశం’’ అని పేర్కొంది.
ఆ తర్వాత తిమోతీని ఆ సమాధిలోనే పెట్టి ఖననం చేశారని ఆమె తెలిపింది. కానీ అతడు ఊహించినట్లు గంట కొట్టి.. సాయం కోరే అవకాశం తిమోతీకి లభించలేదని పేర్కొంది. అయితే, సమాధి లోపల చీకటిగా ఉండటం వల్ల ప్రస్తుతం అతడి శవాన్ని చూడటం కష్టమేనని తెలిపింది. వెర్మాంట్‌లోని న్యూ హెవెన్‌లోని ఎవర్‌గ్రీన్ స్మశానవాటికలో ఈ సమాధి ఉందని వెల్లడించింది. అయితే అప్పట్లో చాలా మంది ఈ సాంప్రదాయాన్ని పాటించేవారట. మరణం తర్వాత జీవితం ఉందని నమ్మేవాళ్లు సైతం ఇలా తమకు తోచిన విధంగా సమాధిలో ఏర్పాట్లు చేసుకొనేవారట. ఈజిప్టులోని మమ్మీలు కూడా ఈ కోవలోకే వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment