పాలకూరతో ఏం చేస్తారు..? పప్పు వండుకుని తింటాం.. అంతేగా.. అయితే పాలకూర మొక్కలతో ఈ–మెయిళ్లు పంపించొచ్చు తెలుసా..? పాలకూరతో ఈ–మెయిల్ ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే మనం ఉన్నది 21వ శతాబ్దం అనే విషయం గుర్తుంచుకోవాలి. పాలకూర మొక్కలు మన స్మార్ట్‌ఫోన్లకు మెయిల్స్ పంపేలా చేయడంలో అమెరికాలోని మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఘన విజయం సాధించారు.
భవిష్యత్తులో భూగర్భ జలాల కాలుష్యం మొదలుకొని వాతావరణ మార్పుల ప్రభావం దాకా అనేక అంశాలపై ఈ మెయిల్స్ ఉపయోగపడుతాయని శాస్త్రవేత్తల అంచనా. ప్రతి మొక్కకూ ఓ కీబోర్డు, మౌస్ ఉండవు కానీ.. వాటి ఆకుల్లోకి కార్బన్ నానోట్యూబ్స్‌ను చేర్చి సందేశాలను అందుకునేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు. ఇన్‌ఫ్రా రెడ్ కిరణాలను ఈ మొక్కలపై ప్రసారం చేసినప్పుడు కార్బన్ నానో ట్యూబ్స్ వెలువరించే కాంతి స్పష్టంగా కన్పిస్తుంది. కాంతిలో ఏదైనా తేడా వస్తే కెమెరా ద్వారా శాస్త్రవేత్తకు మెయిల్ అందుతుంది.
ప్లాంట్ నానోబయోనిక్స్..
ఇటీవల పుట్టుకొచ్చిన సరికొత్త విభాగమే ఈ ప్లాంట్ నానో బయోనిక్స్. మొక్కల లోపల లేదా మొక్కలతో కలసి ఎలక్ట్రానిక్ భాగాలను పనిచేసేలా చేయడం ఇందులోని కీలక అంశం. మొక్కలు రసాయనాలను చాలా బాగా విశ్లేషించగలవు. కాకపోతే ఆ సమాచారం మనకు తెలియదు. ప్లాంట్ నానోబయోనిక్స్ ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకోవచ్చనేది పరిశోధకుల అంచనా. పాలకూరలో నానోట్యూబ్స్‌ను జొప్పించడం ద్వారా భూగర్భ జలాలు, మట్టిలో జరిగే అతి సూక్ష్మమైన మార్పులను కూడా గుర్తించే వీలు కలుగుతుంది.
నీటి, మట్టిలోని కాలుష్యాన్ని మాత్రమే కాకుండా.. మొక్కలకు దగ్గర్లోని పేలుడు పదార్థాలను గుర్తించేందుకు కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చని పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ మైకేల్ స్ట్రానో తెలిపారు. సూక్ష్మస్థాయి సెన్సర్లతోనూ ఈ పనులు చేయొచ్చు. కానీ విద్యుత్ అవసరం లేకుండానే ప్లాంట్ నానోబయోనిక్స్ పనిచేస్తాయి. పైగా ఒకసారి నానో కణాలను మొక్కల్లోకి జొప్పించిన తర్వాత నిరంతరం మనకు సందేశాలు అందుతూనే ఉంటాయి. కొన్నేళ్ల కింద తాము నానో కణాల సాయంతో మొక్కలు చీకట్లో వెలిగేలా చేయగలిగామని, విద్యుత్ అవసరం లేకుండా దాదాపు 4 గంటల పాటు ఈ వెలుతురు పొందొచ్చని స్ట్రానో వివరించారు. – సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment