కాంగ్రెస్ ఎంపీ, ఐక్యరాజ్యసమితి మాజీ దౌత్యవేత్త శశి థరూర్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం ‘షువలియె డి లా లిజియన్ ద హానర్’ లభించింది. ఒక కార్యక్రమంలో ఫ్రెంచ్ సెనేట్ అధ్యక్షుడు గెరార్డ్ లార్చర్.. శశి థరూర్‌ను సత్కరించారు. ఆగస్టు 2022లో థరూర్‌కు ఈ అవార్డును అందజేస్తామని ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ గౌరవం అందించినందుకు ఫ్రాన్స్‌కు థరూర్ కృతజ్ఞతలు తెలిపారు.
భారత్-ఫ్రాన్స్ మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేసినందుకు, అంతర్జాతీయ శాంతి, సహకారంలో చేసిన కృషికి గుర్తింపుగా థరూర్‌కు ఈ గౌరవం లభించిందని భారత్‌లోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రకటనలో అధికారులు.. శశి థరూర్ ప్రతిభ, వ్యక్తిత్వాన్ని కొనియాడారు. ఐక్యరాజ్యసమితిలో దౌత్యవేత్తగా, భారతదేశంలో రాజకీయ నేతగా, రచయితగా థరూర్ విశేష సేవలు అందించారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ హయాంలో థరూర్ విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా, మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో సహా కీలకమైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలలో కూడా థరూర్ పనిచేశారు. థరూర్ పలు పుస్తకాలు రాశారు. వాటిలో కొన్ని ఫ్రెంచ్ భాషలోకి అనువదించారు. థరూర్ ఐక్యరాజ్యసమితిలోనూ పనిచేశారు. కమ్యూనికేషన్స్, స్పెషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్, సెక్రటరీ-జనరల్ కోఫీ అన్నన్‌కు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా కూడా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment