పెషావర్: పాకిస్తాన్‌లోని వాయువ్య ప్రాంతంలో షియా, సున్నీ వర్గాలకు చెందినవారి మధ్య గత కొద్దిరోజులుగా భూ వివాదానికి సంబంధించి జరుగుతున్న ఘర్షణల్లో 25 మంది మృతి చెందారని పాక్ అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని వాయువ్య ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో గల కుర్రం జిల్లాలో గత వారం చివర్లో ప్రారంభమైన ఈ ఘర్షణలు కొంతమేరకు తగ్గాయి. ఈ ఘర్షణల్లో ఇరువర్గాలకు చెందిన 25 మంది మృతిచెందగా, పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.
కుర్రం ప్రాంతం ఇటీవలి కాలంలో మత హింసకు కేంద్రంగా నిలిచింది. ఇక్కడ తలెత్తిన భూవివాదం హింసాత్మకంగా మారకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇక్కడి గిరిజన పెద్దల సహాయంతో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ప్రావిన్షియల్ ప్రభుత్వ ప్రతినిధి బారిస్టర్ సైఫ్ అలీ తెలిపారు. కుర్రంలో శాంతి చర్చల అనంతరం ఇకపై ఎలాంటి హింసాకాండకు పాల్పడకుండా ఉండేందుకు ఇరువర్గాలు అంగీకరించాయన్నారు.
సున్నీ ఆధిపత్య పాకిస్తాన్ జనాభాలో 15 శాతం మంది షియా ముస్లింలున్నారు. చాలా కాలంగా ఈ ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. షియా వర్గం ఆధిపత్యం ఉన్న కుర్రం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఇరు వర్గాల మధ్య మధ్య ఉద్రిక్తతలున్నాయి. ఈ ఏడాది జూలైలో జరిగిన భూ వివాద ఘర్షణల్లో ఇరువర్గాలకు చెందిన పలువురు మృతిచెందారు.
కాగా కుర్రం జిల్లాలో హింసను ముగించేందుకు శాంతి ఒప్పందంపై ఇరు వర్గాల పెద్దలు సంతకం చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ప్రభుత్వానికి సహకరించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ శాంతి ఒప్పందాన్ని ఏ వర్గమైనా ఉల్లంఘించిన పక్షంలో వారు రూ.12 కోట్ల మేరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: భారీ వర్షాల ప్రభావం: ప్రధాని మోదీ పూణె పర్యటన రద్దు
Comments
Please login to add a commentAdd a comment