వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్ పరిసరాల్లో కాల్పులు కలకలం సృష్టించాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో గుర్తు తెలియని దుండగుడు కార్యాలయం బయట కాల్పులకు తెగబడ్డాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ గార్డ్స్ సదరు వ్యక్తి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో ఎదురు కాల్పులు జరపడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దుండగుడిని వెంటనే ఆస్పత్రికి తరలించామని, ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు శ్వేతసౌధ భద్రతా వర్గాలు వెల్లడించాయి.(కాల్పుల కలకలం.. ఒకరి మృతి)
కాగా వైట్‌హౌజ్ బయట కాల్పుల శబ్ధం వినిపించగానే ట్రంప్ ప్రెస్ ఈవెంట్ మధ్యలోనే ఆపివేసి తన కార్యాలయం లోపలికి వెళ్లిపోయారు. దాదాపు 10 నిమిషాల పాటు అక్కడే ఉండిపోయారు. పరిస్థితి చక్కబడగానే మళ్లీ విలేకరుల ఎదుటకు వచ్చిన ట్రంప్.. వైట్‌హౌజ్ పరిసరాల్లో సంచరిస్తూ భద్రతకు భంగం కలిగించిన ఓ వ్యక్తిపై సీక్రెట్ సర్వీసెస్ గార్డ్స్ కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. చట్టప్రకారమే సాయుధుడైన దుండగుడిపై చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. ‘‘వాళ్లు అత్యద్భుతమైన వ్యక్తులు. వాళ్ల సేవల పట్ల సంతోషంగా ఉన్నాను. ఎంతో భద్రంగా ఉన్నట్లు భావిస్తున్నాను’’ అని సత్వరమే స్పందించిన సీక్రెట్ సర్వీస్ గార్డులపై ప్రశంసలు కురిపించారు. అదే విధంగా ఘటనపై విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ప్రపంచంలోని ప్రతీ మూల ఏదో ప్రమాదం పొంచి ఉంటూనే ఉంది కదా’’ అని సమాధానమిచ్చారు. (మా ట్రంప్ ప్రపంచానికే ప్రమాదకరం!)
ఇక ఈ విషయం గురించి వైట్‌హౌజ్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న ఫిలిపోస్ మెలాకు అనే వ్యక్తి మాట్లాడుతూ.. సాయంత్రం 5.50 గంటలకు తనకు కాల్పుల శబ్దం వినిపించిందని, అయితే అంతకంటే ముందే ఓ అరుపు విన్నానని తెలిపారు. అది కచ్చితంగా మగ గొంతేనని, దాదాపు తొమ్మిది మంది సెక్యూరిటీ గార్డులు అతడి వైపుగా పరిగెత్తుకు వచ్చారని చెప్పుకొచ్చారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment