సాధారణంగా కీచైన్ అంటే.. తాళం చెవుల భద్రతకు ఓ ఆధారం మాత్రమే కాదు, తాళం చెవులకు ఓ అలంకారం. ఈనాటి ఫ్యాషన్ తరాలకు.. కీచైన్ అంటే బ్యాగ్‌లకు, వ్యాలెట్లకు తగిలించుకునే ఆర్భాటం కూడానూ. అందుకే చాలామంది ఆకర్షణీయంగా ఉండే ప్లాస్టిక్ పువ్వులు, చెక్క బొమ్మలు, ఆల్ఫబెటికల్ లెటర్స్.. ఇలా స్టైలిష్ లుక్‌నిచ్చే కీచైన్స్‌ని నచ్చిన విధంగా వేలాడదీస్తుంటారు. అయితే ఈ ఫ్యాషన్‌కి కాస్త పైత్యం జోడించారు చైనీయులు.
కొన్నేళ్లుగా ‘లైవ్ యానిమల్ కీచైన్స్’ అంటూ బతికి ఉన్న చిన్నచిన్న జీవులతో కీచైన్స్ అమ్మడం మొదలుపెట్టారు. బేబీ టెర్రాపిన్స్ (చిన్న తాబేళ్లు), చేపలు, రకరకాల జీవులను, కొన్ని సరీసృపాలను.. చిన్న ట్రాన్స్‌పరెంట్ ప్లాస్టిక్ కవర్‌లో బంధించి.. అందులో సగం నీళ్లు, ప్రకాశవంతమైన ఫ్లోరోసెంట్ రంగులు, ఆక్సిజన్, పోషకాలు, ఆహారంగా ఉపయోగపడే ఒక గుళికను ఉంచి ప్యాక్ చేస్తారు.
దాన్ని చిన్న రింగ్ కలిగిన చైన్‌కి వేలాడదీసి, అందులో బంధించిన జీవి సుమారు మూడు నెలల పాటు సజీవంగా ఉంటుందని చెప్పి అమ్ముతున్నారు. అయితే పలు కారణాలతో గాయపడి, ఒత్తిడికి గురై, ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక, ప్రాణవాయువు అందక.. ఈ అల్పజీవులు కొద్ది రోజుల్లోనే చనిపోతుంటాయి. ఇలాంటి క్రూరమైన, అమానవీయమైన పద్ధతిని నిషేధించాలని అక్కడ చాలా స్వచ్ఛందసంస్థలు, జంతుప్రేమికులు పోరాటాలు చేస్తున్నారు. అందుకోసం ఒక పసివాడిని అదే మాదిరి ప్యాక్ చేసి ఉన్న బొమ్మని పెట్టి.. ‘ఇలా మనుషుల్ని అమ్మగలరా? లేదు కదా..? మరి చిన్న చిన్న జీవులు ఏం పాపం చేశాయి? వాటినెందుకు ఇలా అమ్ముతున్నారు?’ అని నినదిస్తున్నారు.
అయితే ఇలాంటి ఫ్యాషన్ ట్రెండ్ ఇదేం మొదటిది కాదు. దక్షిణ అమెరికా వాసులు ‘బతికి ఉన్న కీచురాళ్లను’ ఆభరణాల్లో ధరిస్తారు. ఇవి చూడటానికి రత్నాలు పొదిగిన కదిలే ఆభరణాల్లా ఉంటాయి. బతికి ఉన్న అల్పజీవులతో అలంకరణ వస్తువులను తయారుచేసే పైత్యం చైనాలో కొత్త కాదు. 2015లో ఒక కంపెనీ బతికున్న చీమలతో గడియారాలను తయారుచేసి, మార్కెట్‌లోకి విడుదల చేసింది. విమర్శలు రావడంతో అప్పట్లో ఆ గడియారాలను వెనక్కు తీసుకుని, అదొక ఏప్రిల్ ఫూల్ జోక్ అంటూ కవర్ చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment