ట్రంప్‌ Vs జెలెన్‌స్కీ.. వెల్లువెత్తిన జోక్స్, మీమ్స్‌ | Social Media Trolls And Memes Over Trump And Zelensky Meeting, Watch Videos Inside | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ Vs జెలెన్‌స్కీ.. వెల్లువెత్తిన జోక్స్, మీమ్స్‌

Published Sun, Mar 2 2025 7:55 AM | Last Updated on Sun, Mar 2 2025 3:58 PM

Social Media Trolls Memes Over Trump And Zelensky Meeting

ఓవైపు ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ఇంకొకరు వచ్చి చుట్ట కాల్చుకోవడానికి నిప్పు కావాలని అడగాడట. ఉక్రెయిన్, రష్యా యుద్ధం.. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదముందని ప్రపంచ దేశాలు ఓవైపు భయపడుతుంటే ఆ భయాలను తొలగించి యుద్ధాన్ని ఆపేందుకు, బదులుగా అత్యంత విలువైన ఖనిజాలపై అజమాయిషీ కోసం అమెరికా చేసిన ప్రయత్నం విఫలం కాగా ఆ ఘటనను మీమర్స్‌ తమ జోకులకు పెద్ద ముడి సరుకుగా వాడుకుంటున్నారు.

శుక్రవారం శ్వేతసౌధంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మధ్య భేటీ తొలుత మర్యాదపూర్వకంగా, తుదకు అమర్యాదపూర్వకంగా, పరస్పర హెచ్చరికలకు వేదికగా మారి అర్ధంతరంగా ముగిసిన విషయం తెల్సిందే. అమెరికాసహా అంతర్జాతీయ మీడియా సాక్షిగా జరిగిన ఈ రసాభాసా వాగ్వాద భేటీపై ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మీమ్స్‌ తెగ వెల్లువెత్తుతున్నాయి.  

తారాస్థాయిలో వాగ్వాదం 
ఓవల్‌ ఆఫీస్‌లో అంతర్జాతీయ మీడియా ప్రతినిధుల సమక్షంలో ట్రంప్, జెలెన్‌స్కీ భేటీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. చివర్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కలగజేసుకుని జెలెన్‌స్కీపై తీవ్ర అసహనం వ్యక్తంచేయడం, అందుకు ట్రంప్‌ వంతపాడటం, దీనికి దీటైన బదులిస్తూ జెలెన్‌స్కీ మాట్లాడం చూసిన వారెవరికైనా ట్రంప్, జెలెన్‌స్కీ కొట్టుకుంటారా అన్న అనుమానం వచ్చింది. వాస్తవంలో సాధ్యంకాని వాళ్ల పిడిగుద్దులు, డిష్యుండిష్యుం ఫైట్‌ సీన్‌ను కృత్రిమ మేథ సాధ్యం చేసింది. ఒరిజినల్‌ వీడియోతో ట్రంప్, జెలెన్‌స్కీ ఫైట్‌సీన్‌ను ఏఐలో సృష్టించి ఆన్‌లైన్‌లో షేర్‌చేశారు. ఆ వీడియో ఎడిటింగ్‌ మొదటి మూడు, నాలుగు సెకన్లు నిజంగానే కొట్టుకున్నారా అన్నంతగా కుదిరింది. ఇప్పుడీ వీడియో అన్ని సోషల్‌మీడియా యాప్స్‌లో వైరల్‌గా మారింది. ఇంకొక వీడియోను పూర్తి భిన్నంగా సృష్టించారు.

వాస్తవంలో ట్రంప్, జేడీ వాన్స్‌తో జెలెన్‌స్కీ వాగ్వాదానికి దిగితే ఏఐ వీడియోలో మాత్రం వీళ్లిద్దరినీ జెలెన్‌స్కీ చేతులు పట్టుకుని మరీ బతిమాలుతూ ‘మా దేశాన్ని కాపాడండి’’అని వేడుకుంటున్నట్లు రూపొందించారు. ఇందులో ‘ఇప్పటికి చేసిన సాయం చాలు, ఇక సాయం సంగతి మర్చిపో’అని ట్రంప్, వాన్స్‌లు జెలెన్‌స్కీ చేతులను దులిపేసుకుంటున్నట్లు ఏఐ వీడియో క్రియేట్‌చేశారు. ఇది కూడా తెగ నవ్వులు తెప్పిస్తోంది. అత్యంత విలువైన ఖనిజాలపై ఆధిపత్యం సంపాదించి అమెరికన్‌ పెత్తందార్లు వాటితో వేల కోట్లు గడించాలని భావించి, ఇప్పుడు భంగపడ్డారని తెలిపేలా ఒక వెయిటర్‌ ‘ఖనిజాల డీల్‌ రద్దయింది. సారీ. మీకు భోజనాలు లేవు’అంటూ బడా పారిశ్రామికవేత్తలకు చూపిస్తున్నట్లు పాతకాలంనాటి ‘ఫాల్టీ టవర్స్‌’సీరియల్‌ ఎపిసోడ్‌ను మీమ్స్‌లో వాడారు.  

భారతీయ ‘ట్రీట్‌మెంట్‌’ 
భారత్‌లో సాధారణ నిరుపేద కుటుంబంలో తల్లిదండ్రులు తమ పిల్లలను తమకు నచ్చినట్లు పెంచేందుకు ప్రయత్నిస్తుంటారు. వైట్‌హౌజ్‌లో ట్రంప్, జేడీ వాన్స్‌ సైతం జెలెన్‌స్కీని దాదాపు అలాగే మీడియాకు చూపేందుకు ప్రయత్నించారని నెటిజన్లు మరో మీమ్‌ సిద్ధంచేసి సామాజిక మాధ్యమాల్లోకి వదిలారు. రష్యాతో యుద్ధంలో ఇంత సాయపడిన మాకు శ్వేతసౌధంలో మీడియా సమక్షంలో అగ్రరాజ్య అధ్యక్షునికి కనీసం గౌరవం ఇవ్వరా?. ఒక్కసారైనా మా ప్రెసిడెంట్‌కు థాంక్యూ అని చెప్పారా? అని జెలెన్‌స్కీని వాన్స్‌ నిలదీస్తూ హెచ్చరించడం తెల్సిందే. ఈ సందర్భంలో వాన్స్, ట్రంప్‌ సగటు భారతీయ తల్లిదండ్రుల్లా అద్భుతమైన పాత్ర పోషించారని నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్‌లు పెట్టారు.

 

పొగుడుతూ పోస్ట్‌లు 
మరోవైపు జెలెన్‌స్కీని మీడియా ఎదుటే చక్రబంధంలో ఇరికించే ప్రయత్నంలో వాన్స్, ట్రంప్‌ దాదాపు సఫలమయ్యారని వీళ్లను పొగిడే వారి సంఖ్యా పెరిగింది. యుద్ధంలో వందల కోట్ల డాలర్లు ఇచ్చిన మాపై మీరు చూపించే మర్యాద ఇదేనా?. మీరు ఇదే ధోరణి కనబరిస్తే దౌత్యబంధం తెగిపోతుందని వాన్స్‌ హెచ్చరించి జెలెన్‌స్కీని ఒకింత సందిగ్ధంలో పడేశారని అమెరికన్‌ మీడియా ఆయనను పొగడ్తల్లో ముంచెత్తింది. అయితే జెలెన్‌స్కీని పొడిగే వారి సంఖ్యా అమాంతం పెరిగింది. ఇందులో సాధారణ ప్రజలతో పాటు దేశాధినేతలు ఉన్నారు.

 

యూరప్‌దేశాల అధినేతలు ఆయనకు ఫోన్‌చేసిమరీ తమ మద్దతు పలికినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. మిత్రదేశానికి ప్రతిఫలం ఆశించి సాయం చేస్తే ఆ సాయానికి అర్థమే ఉండదని, సహజ సంపదను కాజేసేందుకు కుట్ర పన్నిన అమెరికాను జెలెన్‌స్కీ సాక్షాత్తూ శ్వేతసౌధంలోనే కడిగిపారేశారని ఆయనను పొగుడుతూ పోస్ట్‌లు వెల్లువెత్తాయి. భవిష్యత్తులో రష్యా మళ్లీ దురాక్రమణకు దిగితే మాకు ఉండే రక్షణ ఏర్పాట్లు ఏమిటి?. ఆ విషయంలో మీరెలా మాకు సాయపడగలరు? అని జెలెన్‌స్కీ అడిగిన సూటి ప్రశ్నకు ట్రంప్, జేడీ వాన్స్‌ సరైన సమాధానం చెప్పలేకపోవడం తెల్సిందే. ఇద్దరు అగ్రనేతలు రెచ్చగొట్టినా జెలెన్‌స్కీ సంయమనం కోల్పోలేదంటూ మరో మీమ్‌ సందడిచేస్తోంది.

ప్రముఖ హాలీవుడ్‌ నటుడు టామ్‌ క్రూజ్‌ నటించిన ఎయిర్‌ఫోర్స్‌ సినిమా సీన్‌లో పైఅధికారి ఇష్టమొచ్చినట్లు తిడుతున్నా టామ్‌ క్రూజ్‌ పట్టరాని ఆవేశంతో ఉన్నాసరే సంయమనం పాటించినట్లు జెలెన్‌స్కీ కూడా నిగ్రహంతో ఉన్నారని మీమ్‌ క్రియేట్‌ చేశారు. వైట్‌హౌజ్‌లో ముగ్గురు నేతల వాగ్వాదాన్ని ప్రత్యక్షంగా చూసి హుతాశురాలైన ఉక్రెయిన్‌ మహిళా రాయబారి ఒక్సానా మార్కరోవా తలపట్టుకోవడంపైనా ఒక మీమ్‌ బయటికొచి్చంది. మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగేన్‌(అమెరికాను మళ్లీ గొప్పగా చేద్దాం) నినాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కీలక నేతగా జెలెన్‌స్కీ ఎదిగారంటూ, భేటీలో ఎడముఖం పెడముఖంగా కూర్చున్న ట్రంప్, జెలెన్‌స్కీ ఫొటోను మరొకరు పోస్ట్‌చేశారు. 
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement