ఆ చిన్నారి సాహసం వృథా అయ్యింది. స్నేహితుల్ని రక్షించాలనే తాపత్రయం.. చివరకు అతన్ని కూడా బలిగొంది. సెంట్రల్ ఇంగ్లండ్ బర్మింగ్‌హమ్ సోలిహల్ సరస్సు విషాదంలో ముగ్గురు పిల్లలు కన్నుమూయగా.. స్థానికంగా విషాదం అలుముకుంది. తన స్నేహితుల్ని కాపాడబోయి ప్రాణాలు అర్పించిన జాక్ జాన్సన్‌ను(10) తల్చుకుని స్థానికులు కంటతడి పెడుతున్నారు.
ఇంగ్లండ్‌లో మైనస్ ఉష్ణోగ్రతల కారణంగా.. విపరీతంగా మంచు కురుస్తోంది. వాతావరణ ప్రభావంతో.. సోలిహల్‌లోని బాబ్స్ మిల్ పార్క్ దగ్గర ఓ సరస్సు గడ్డ కట్టుకుపోయింది. ఆదివారం మధ్యాహ్నాం నలుగురు చిన్నారులు ఆ సరస్సులో ఆడుకోవడానికి వెళ్లారు. హఠాత్తుగా ఓ చోట మంచు ఫలకం విరిగింది. దీంతో పిల్లలు నీళ్లలోకి మునిగిపోయారు. తన స్నేహితులు మునిగిపోతున్న విషయం ఒడ్డు నుంచి గమనించిన జాక్.. పెద్దలను పిలవాలనే సంగతి మరిచాడు. మరో మాట లేకుండా ధైర్యం చేసి నీళ్లలోకి దూకాడు. ఆ సమయంలో సైకిల్‌పై వెళ్తున్న ఓ యువతి.. కేకలు వేయడం ప్రారంభించింది.
కానీ, జాక్ ప్రయత్నం ఫలించలేదు. పైగా క్షణాల్లో మంచు గడ్డ కట్టుకుపోవడంతో.. ఆ సరస్సు కిందే అతనూ చిక్కుకున్నాడు. సమాచారం అందుకోగానే.. పరుగున అక్కడికి చేరుకున్న జాక్ జాన్సన్ తాత, అతన్ని మిగతా పిల్లలను రక్షించే యత్నం చేసినా లాభం లేకుండా పోయింది. మంచు పొర మందంగా ఉండడంతో దానిని బద్ధలు కొట్టడం ఆలస్యం అయ్యింది. హుటాహుటినా సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. ఓ అధికారి తన చేతులతో ఆ మంచు ఫలకాన్ని బద్ధలు కొట్టే యత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. జనం చేరిన ఇరవై నిమిషాలకు.. పిల్లల్ని అచేతనంగా బయటకు తీశారు.
నలుగురు పిల్లలను ఆస్పత్రికి తరలించగా.. అందులో ముగ్గురు(జాక్‌తో సహా) అప్పటికే కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయారని వైద్యులు ధృవీకరించారు. ఆరేళ్ల మరో చిన్నారి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంకెవరైనా పిల్లలు అందులో ఇరుక్కుపోయారా? అనే కోణంలో అధికారులు గాలింపు చేపట్టారు. చివరకు ఎవరూ లేరని విషయం నిర్ధారించుకుని చర్యలు ఆపేశారు. చిన్నారుల మరణంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకోగా.. అంతా నివాళులు అర్పిస్తున్నారు. ప్రధాని రిషి సునాక్ సైతం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment