సియోల్: కరోనా మహమ్మారిని సమర్థవంతంగా కట్టడి చేసినట్లు వెల్లడించిన దక్షిణ కొరియాలో తాజాగా భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా వెలుగు చూస్తున్న కరోనా కేసులు జనాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా సియోల్ ప్రాంతంలో పరిస్థితులు చేజారిపోతున్నట్లు అధికారలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో సగం జనాభా అనగా సుమారు 51 మిలియన్ల మంది ఇక్కడే నివసిస్తున్నారు. శనివారం ఇక్కడ 166 కొత్త కరోనా కేసులు వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు. మార్చి 11 నుంచి చూస్తే.. ఒకే రోజు ఇంత భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అంటున్నారు అధికారులు. శుక్రవారం 103 కేసులు వెలుగు చూశాయి. వరుసగా రెండు రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 100 దాటడంతో జనాలు ఆందోళనకు గురవుతున్నారు. కొత్త కేసులలో 11 మినహా మిగిలినవి లోకల్ ట్రాన్స్‌మిషన్ వల్ల సంక్రమించాయని.. అవి కూడా చాలావరకు సియోల్ ప్రాంతంలో ఉన్నాయని అధికారులు తెలిపారు. (కోవిడ్‌కు దక్షిణ కొరియా కళ్లెం ఇలా..)
దక్షిణ కొరియాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శనివారం ప్రకటించిన గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు దక్షిణ కొరియాలో 15,039 కేసులు నమోదు కాగా 305 కరోనా మరణాలు సంభవించాయి. కొత్తగా వెలుగు చూసిన కేసులలో 155 స్థానికంగా నమోదయ్యాయన్నారు అధికారులు. ఇవన్ని కూడా ఎక్కువ జనసాంద్రత కల్గిన సియోల్ మెట్రోపాలిటన్ ప్రాంతంలోనే నమోదయ్యయని తెలిపారు. ఈ ప్రాంతంలో వేలాది చర్చిలను మూసివేయలేదు. దాంతో వైరస్ వ్యాప్తికి ఇవి కేంద్రాలుగా నిలిచాయి. చర్చి నిర్వహకులు కరోనా నివారణ చర్యలను అమలు చేయడంలో విఫలమయ్యారంటున్నారు అధికారులు. ఆరాధకులు మాస్క్ తీసేసి ప్రార్థనల్లో పాల్గొనడమే కాక.. పాటలు పాడే సమయంలో, భోజన సమయంలో గుంపులుగా చేరడం, మాస్క్ ధరించకపోవడంతో వైరస్ వ్యాప్తి పెరుగుతుందన్నారు అధికారులు. అంతేకాక నర్సింగ్ హోమ్‌లు, పాఠశాలలు, రెస్టారెంట్లు, బహిరంగ మార్కెట్లు, డోర్ టూ డోర్ సేల్స్ పర్సన్‌ల వల్ల వైరస్ వ్యాప్తి పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. (ఏంటి డాక్టర్ ఇదీ..)
నేడు దక్షిణ కొరియా స్వాతంత్ర్య దినోత్సవం. యుఎస్, సోవియట్ దళాలు కొరియాపై దశాబ్దాలుగా ఉన్న జపాన్ ఆక్రమణను ముగించిన రోజు కాబట్టి దక్షిణ, ఉత్తర కొరియా రెండింటిలోనూ ఆగస్టు 15న ప్రతి సంవత్సరం పండుగలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా వేడుక నిర్వహించారు. అయితే నిర్వహకులు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని అధికారుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందనే ఉద్దేశంతో ఇప్పటి వరకు దక్షిణ కొరియాలో సామాజిక దూరం అమలు చేయలేదు. కానీ ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం కఠిన నియమాలు అమలు చేస్తుందని భావిస్తున్నారు జనాలు.
Comments
Please login to add a commentAdd a comment