వీగిపోయిన అభిశంసన తీర్మానం
సియోల్: ఎమర్జెన్సీ ప్రకటిస్తూ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో ఇంటాబయటా విమర్శలను ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు పదవీగండం కొద్దిలో తప్పింది. ఎమర్జెన్సీ(మార్షల్ లా) విధిస్తూ నిర్ణయం తీసుకుని దేశంలో రాజకీయ సంక్షోభానికి తెరలేపారని ఆరోపిస్తూ ఆయనపై విపక్షాలు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయింది.
300 మంది సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో అభిశంసన తీర్మానం నెగ్గాలంటే మూడింట రెండు వంతుల మంది సభ్యులు అంటే కనీసం 200 మంది మద్దతు పలకాల్సి ఉంటుంది. శనివారం చేపట్టిన ఓటింగ్‌లో అభిశంసనను సమర్థిస్తూ కేవలం 192 ఓట్లు పడ్డాయి. యూన్‌కు చెందిన పీపుల్స్ పవర్ పార్టీ ఓటింగ్‌ను బహిష్కరించింది. వచ్చే బుధవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సెషన్‌లో మరోమారు అభిశంసన తీర్మానాన్ని పెట్టాలని విపక్ష పార్టీలు పట్టుదలగా ఉన్నాయి. అంతకుముందు యూన్ మార్షల్ లా విధించడం తప్పేనంటూ ప్రజలకు బహిరంగ క్షమాపణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment