లేదంటే విమానం ఎక్కనివ్వం
స్పిరిట్ ఎయిర్‌లైన్స్ కఠిన నిబంధనలు
వాషింగ్టన్: అర్థంపర్థం లేని టాటూలు, అసభ్యకర దుస్తులతో విమానంలో ప్రయాణిస్తామంటూ స్పిరిట్ ఎయిర్‌లైన్స్ విమానాల్లో ఇకపై కుదరదు. ఆ మేరకు తాజాగా సంస్థ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. వివాదాస్పద కొటేషన్లున్న టీ షర్టులు ధరించినా ఒప్పుకోబోమని వెల్లడించింది. ఒక పద్ధతి ప్రకారం, హుందాతనం ఉట్టిపడేలా దుస్తులు ధరించాలని తేల్చి చెప్పింది. తోటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా వస్త్రధారణ ఉండాలని సూచించింది.
‘‘ ఇష్టమొచ్చిన దుస్తుల్లో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి మా స్పిరిట్ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కుతామంటే కుదరదు. పద్ధతిగా బట్టలుండాలి. అందాల ఆరబోతకు అవకాశం ఇవ్వబోము. నిండుగా దుస్తులు ధరిస్తే మరీ మంచిది. చెప్పులు, షూ లేకుండా ఎలాంటి పాదరక్షలు ధరించకుండా వస్తామంటూ ఊరుకోం. ముఖ్యంగా అమ్మాయిల దుస్తులు మరీ పల్చగా, లోదుస్తులు కనిపించేంత పారదర్శకమైన డ్రెస్సింగ్‌లో వస్తే అస్సలు ఒప్పుకోం’’ అని స్పిరిట్ ఎయిర్‌లైన్స్ పలు నియమనిబంధనలను ప్రకటించింది.
‘‘ పిచ్చిపిచ్చి టాటూలు, రాతలు, కొటేషన్లు, వివాదాస్పద వస్తువులు ధరించి వచ్చినా విమానం లోపలికి అనుమతించబోం. కనీసం బోర్డింగ్ పాస్ ఇవ్వం. ఇలా వచ్చినవారిని కుదిరితే ఎయిర్‌పోర్ట్ నుంచి కూడా వెనక్కి పంపేస్తాం’’ అని యాజమాన్యం స్పష్టంచేసింది. ఆధునికత పేరిట మరీ పొట్టిపొట్టి దుస్తులు ధరిస్తూ అమ్మాయిలు తోటి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్న ఘటనలు తరచూ అమెరికా విమానాశ్రయాల్లో సంభవిస్తున్నాయి.
వీటిని అరికట్టేందుకే ఇలాంటి నియామవళిని ఈ సంస్థ అమల్లోకి తెచ్చింది. గత అక్టోబర్‌లో తారా కెహెదీ అనే అమ్మాయి మరీ పొట్టిగా ఉన్న క్రాప్ టాప్ ధరించి రావడంతో అందరూ ఆ అమ్మాయి వంకే చూడటం మొదలెట్టారు. ఇది గమనించిన ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఆమెను అడ్డుకోవడం, తదనంతరం నానా హంగామా జరగడం తెల్సిందే.
2019లో అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కిన లాటిసా తిషా రోవే అనే అమ్మాయి అందాల ఆరబోత అతిగా ఉన్న స్ట్రాప్‌లెస్ రోంపర్ ధరించి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చింది. దీంతో అక్కడ ఉన్న ఇతర ప్రయాణికులు ఆమెను దూషించడం, కొందరు యువకులు ఆమెను ఎగతాళిచేయడం తెల్సిందే. ఈ ఉదంతంలో చివరకు ఎయిర్‌లైన్స్ సంస్థే ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పింది. అమ్మాయి వస్త్రధారణకు చివరకు ఎయిర్‌లైన్స్ క్షమాపణ చెప్పిన నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు రాకూడదన్న ముందు జాగ్రత్తతో స్పిరిట్ ఎయిర్‌లైన్స్ ఇలా కఠిన నియమాలను అమల్లోకి తెచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment