తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక బెయిలౌట్ కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధితో చర్చలు జరుపుతోంది. అదే సమయంలో ప్రజా వ్యతిరేకత నుంచి పుట్టుకొచ్చిన రాజకీయ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసింది.
శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స ప్రతిపక్షాలకు ప్రభుత్వ ఏర్పాటునకు పిలుపు ఇచ్చాడు. అంతా కలిసి కేబినెట్ ఏర్పాటు చేద్దామంటూ పిలుపు ఇచ్చాడు. అఖిలపక్ష ప్రభుత్వం ద్వారా ప్రభుత్వంపై నెలకొన్న ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకు ఈ మేరకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేబినెట్ ఏర్పాటునకు ముందుకు రావాలంటూ ఆయన అన్ని పార్టీలకు సందేశం పంపారు. ఈ మేరకు రాజపక్స ఆఫీస్ ఒక ప్రకటన విడుదల చేసింది. నిరసనలు తారాస్థాయికి చేరుతున్న క్రమంలో.. కొత్త కేబినెట్‌పై ఇవాళే ఓ కొలిక్కి రావాలని అధ్యక్ష భవనం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఆదివారం అర్ధరాత్రి దాటాక.. లంక కేంద్ర కేబినెట్‌లోని 26 మంత్రులంతా రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అజిత్ నివార్డ్ కబ్రాల్ సైతం సోమవారం తన పోస్టుకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని పదవిని వీడని మహీంద రాజపక్స.. సోమవారం ఉదయం అధ్యక్ష భవనానికి చేరుకుని రాజకీయం మొదలుపెట్టాడు.
మొత్తం ఐదుగురు రాజపక్స కుటుంబ సభ్యులు మంత్రివర్గంలో ఇదివరకు ఉన్నారు. అధ్యక్షుడు గోటబయా రాజపక్స(రక్షణ మంత్రిగా), ప్రధాని మహీంద రాజపక్స, ఇరిగేషన్ మినిస్టర్ చామల్ రాజపక్స, బసిల్ రాజపక్స, ప్రధాని మహీంద తనయుడు నమల్ రాజపక్స క్రీడాశాఖ మంత్రిగా ఉన్నారు ఇంతకాలం. అంతేకాదు.. ఇతర ప్రధాన పోస్టింగ్‌లోనూ కుటుంబ పాలనే నడుస్తోంది అక్కడ. దీంతో దోచుకున్న సొమ్మును ఈ కష్టకాలంలో ప్రజల కోసం ఖర్చు చేయాలంటూ ప్రజలు నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
మరోవైపు అధ్యక్షుడి కేబినెట్ ఆఫర్ పట్ల ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయనేది తెలియాల్సి ఉంది. ప్రతిపక్ష నేత సాజిత్ మాత్రం మంత్రుల రాజీనామాను ఓ మెలోడ్రామాగా అభివర్ణించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment