
కొలంబో: లంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సేకు మంగళవారం పార్లమెంట్‌లో ఊరట లభించింది. ఆయనపై అవిశ్వాసాన్ని వెంటనే చర్చించాలన్న ప్రతిపక్షాల వాదనను పార్లమెంట్ తిరస్కరించింది. రాజపక్సేను అభిశంసిచేందుకు తక్షణం చర్చ చేపట్టాలంటూ ప్రతిపక్ష తమిళ్ నేషనల్ అలయన్స్ నేత సుమంత్రిన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా 119 మంది, అనుకూలంగా 68 మంది ఎంపీలు ఓటువేశారు.
మరోవైపు డిప్యుటీ స్పీకర్ ఎన్నికలో ప్రభుత్వ మద్దతున్న శ్రీలంక పొడుజన పెరుమున అభ్యర్థి అజిత్ రాజపక్సే గెలుపొందారు. ఆయనకు అనుకూలంగా 109 ఓట్లు, ప్రత్యర్థికి 78 ఓట్లు వచ్చాయి. ఎన్నిక సందర్భంగా అధికార, విపక్షాల మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి. మహింద రాజపక్సే రాజీనామా తర్వాత తొలిసారి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి.
విక్రమసింఘేపై విమర్శలు
అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా పధ్రాని రణిల్ విక్రమసింఘే ఓటు వేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ‘‘అధ్యక్షుడిని ఎవరు కాపాడుతున్నారో, మిమ్మల్ని ఎవరు కాపాడుతున్నారో దేశమంతా చూస్తోంది.’’ అని సుమింత్రన్ దుయ్యబట్టారు. పదవి కోసం రణిల్ తన నైతికతను అమ్ముకున్నారన్నారు. ఆయన ఒక తోలుబొమ్మ అని ప్రధాన ప్రతిపక్ష నేత కవిరత్న విమర్శించారు.
రణిల్ చర్యను ఆయన పార్టీ సమర్ధించింది. అధ్యక్షుడిని కాపాడుతున్న ఎంపీల నిజస్వరూపాన్ని ఓటింగ్ బయటపెట్టిందని మానవహక్కుల కార్యకర్త భవానీ ఫొన్సెకా విమర్శించారు. దేశంలో స్కూళ్లను మంగళవారం నుంచి పునఃప్రారంభిస్తున్నారు. కర్ఫ్యూను తొలగిస్తామని, రైళ్ల రాకపోకలు పునరుద్ధరించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
చదవండి: (మీరొస్తానంటే.. నేనొద్దంటా!)