రూ.105 కోట్లు పలికిన ప్రఖ్యాత టిఫానీ విండో
దూరం నుంచి చూస్తే నల్లని వస్త్రంపై చిత్రకారుడి కలం నుంచి జాలువారిన అద్భుత చిత్రరాజం అనిపించకమానదు. కానీ దగ్గరికెళ్లి తరచిచూస్తే సప్తవర్ణశోభితమై ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే ఒక అద్దం కిటికీ అని వెంటనే తెలుస్తుంది. అపురూప కళాఖండంగా దశాబ్దాల క్రితమే ఘన కీర్తిని మూటగట్టుకున్న ఈ గాజు కిటీకి మళ్లీ రెండు పుష్కరాల తర్వాత కొచ్చింది.
24 ఏళ్ల క్రితం రూ.16 కోట్లకుపైబడి ధర పలికి ఔరా అనిపించిన ఈ గాజు కిటికీ తాజాగా సోమవారం ఏకంగా రూ.105 కోట్లకు అమ్ముడుపోయి తన విశిష్టతకు ఏ అద్దమూ సాటిరాదని నిరూపించుకుంది. 20వ శతాబ్దానికి చెందిన అమెరికన్ కళాకారుడు లూయిస్ కంఫర్ట్ టిఫానీ ఈ గాజు కిటికినీ తయారుచేశారు.
అలంకార, సౌందర్య కళల్లో లూయిస్‌ది అందె వేసిన చేయి. స్టెయిన్ గ్లాస్‌తో ఆయన చేసిన కళాకృతులు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిపొందాయి. ఓహియో రాష్ట్రంలోని క్యాంటన్ సిటీలో తొలి బాప్టిస్ట్ చర్చి వ్యవస్థాపకుల్లో ఒకరైన జాన్ థెరిసా డ్యానర్ గౌరవార్థం లూయిస్ ఈ కిటికీని తయారుచేశారు. అందుకే దీనిని ‘డ్యానర్ మెమోరియల్ విండో’అంటారు.
16 అడుగుల కళాఖండం
సోమవారం న్యూయార్క్‌లోని సోత్‌బే వేలంసంస్థ నిర్వహించిన వేలంలో కేవలం ఆరున్నర నిమిషాల్లో ఊహించినదానికంటే నాలుగు రెట్లు అధిక ధరకు ఇది అమ్ముడుపోవడం విశేషం. బిలియనీర్ అలెన్ గెర్రీ దీనిని విక్రయించగా ఒక గుర్తు తెలియని వ్యక్తి దీనిని కొనుగోలుచేశారని సోత్‌బే సంస్థ ప్రకటించింది. టిఫానీ రూపొందించిన కిటీకీల్లో ఇంతవరకు ఇంత భారీ ధరకు అమ్ముడుపోయిన తొలి గాజు కిటికీ ఇదే. వాస్తవానికి చర్చి కోసం దీనిని తయారుచేసినా చివరకు వినియోగించకుండా వదిలేశారు.
గలగలపారే సెలయేరుకు ఇరువైపులా విరగగాసిన ఫలాలతో అలరారుతున్న వృక్షాలు ఊసులాడుకుంటున్నట్లు ఎంతో రమ్యంగా రంగులద్దారు. డిజైన్ ఆగ్నిస్ నార్త్‌రోప్ ఈయనకు సాయపడ్డారు. 1913లో దీని తయారీ పూర్తయింది. ‘‘టిఫానీ రూపొందించిన గాజు కిటికీలు ఇన్నేళ్లు గడిచినా మార్కెట్‌లో తమ హవా కొనసాగిస్తున్నాయనడానికి ఈ కిటికీ వేలమే నిదర్శనం’’అని సోత్‌బే చైర్మన్ జోడీ పొల్లాక్ అన్నారు.
లూయిస్ టిఫానీ వాళ్ల నాన్నకు అమెరికాలో టిపానీ అండ్ కో. పేరిట స్టెయిన్ గ్లాస్ తయారీ కర్మాగారం ఉండేది. అందులో పనిచేస్తూనే టిఫానీ ఎన్నో కళాఖండాలను సృష్టించారు. గాజు దీపాలు, పుష్పలంకరణ వస్తువులను తయారుచేశారు. అమెరికాలోని న్యూయార్క్‌తోపాటు బ్రిటన్‌లోని లండన్, ఫ్రాన్స్‌లోని పారిస్ సొంత స్టోర్‌లలో ఈయన కళారూపాలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. పెన్సిల్వేనియా, మసాచు సెట్స్, న్యూయార్క్‌లోని చాలా చర్చిల్లో ఈయన గాజు కిటీకీలే మనకు దర్శనమిస్తాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment