న్యూఢిల్లీ: కరోనా గాలి ద్వారా వ్యాపించడం ప్రారంభమైందని తాజా పరిశోధనలో వెల్లడైంది. దీనికి సంబంధించిన శాస్త్రీయ వివరాలను లాన్సెట్ జర్నల్ ప్రచురించింది. యూకేలోని ఆక్స్‌ఫర్డ్ నిపుణులు, అమెరికా, కెనడా నిపుణులతో కూడిన 6 మంది సభ్యుల బృందం దీనిపై పరిశోధనలు చేసి దాదాపు 10 మార్గాల ద్వారా గాలిని వాహకంగా వాడుకొని కరోనా వ్యాపిస్తోందని తేల్చారు. తుంపరల కంటే సూక్ష్మ స్థాయిలో, గాలి ద్వారా కరోనా వ్యాపిస్తోందని నిపుణుల బృందానికి నాయకత్వం వహిస్తున్న జోస్ లూయిస్ జిమెనెజ్ వెల్లడించారు.
‘ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)తో పాటు ఇతర దేశాల ఆరోగ్య సంస్థలు కూడా ఈ పరిశోధనలోని విషయాలను పరిశీలించి, వైరస్‌ను అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి’ అని ఆయన కోరారు. ఒకే హోటల్లో వేర్వేరు గదుల్లో ఉంటూ, ఏ మాత్రం భౌతికంగా దగ్గరకు చేరకపోయినా కరోనా వచ్చినట్లు తమ పరిశోధనలో తేలిందని నివేదిక పేర్కొంది. మూసి ఉన్న చోట్ల కరోనా వ్యాప్తి మరింత ఎక్కువగా ఉందని, ఇళ్లలోని వెంటిలేషన్ విభాగాలను పూర్తి స్థాయిలో ఉపయోగించాల్సి అవసరం వచ్చిందని సూచించింది.
ఇలా సోకుతుంది..
కరోనా సోకిన వ్యక్తి గాలి వదిలినా, మాట్లాడినా, పాటలు పాడినా, తుమ్మినా వెంటనే కరోనా గాలిలో చేరుతోందని నివేదిక చెప్పింది. తుంపరలు నేల మీద పడినా, గాలిలో మాత్రం కరోనా నిలిచే ఉంటోందని వెల్లడించింది. ఇంట్లో ఉన్నప్పటికీ నాణ్యమైన మాస్క్ ధరించడం, అధిక నాణ్యమైన పీపీఈ కిట్లను వైద్య సిబ్బందికి ఇవ్వడం ద్వారా దీని ప్రమాదం నుంచి బయట పడవచ్చని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment