వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవితవ్యం మరికొద్ది సేపట్లో తేలనుంది. ఈ ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల రేసులో ఆయన ఉంటారా లేదా అన్నదానిపై అమెరికా సుప్రీం కోర్టు కాసేపట్లో తీర్పు ఇవ్వనుంది. 2020అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ట్రంప్ మద్దతుదారులు వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్‌పై దాడి చేసి విధ్వంసానికి పాల్పడ్డారు.
ఈ కేసు ట్రంప్ మెడకు చుట్టుకుంది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ 3వ సెక్షన్ ప్రకారం ఏదైనా పదవీ ప్రమాణం చేసి తిరుగుబాటుకు పాల్పడిన వారు తిరిగి ఎలాంటి ప్రభుత్వ పదవి చేపట్టేందుకు వీలు లేదు.ఇదే సెక్షన్ ఆధారంగా ఇప్పటికే కొందరు ఓటర్లు కొలరాడో సుప్రీం కోర్టులో కేసు వేశారు. ఈ కేసులో ట్రంప్‌నకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.
దీంతో ఇప్పటికే ట్రంప్‌ను కొలరాడో ప్రైమరీ బ్యాలెట్‌లో పోటీ నుంచి తొలగించారు. అయితే తాజగా అప్పీల్ కోర్టులో రాజ్యాంగంలోని 14వ సవరణ సెక్షన్ 3 ట్రంప్‌నకు వర్తిస్తుందా లేదా అనేది తేల్చడంతో పాటు కొలరాడో కోర్టు ఇచ్చిన తీర్పుపైనా విచారణ జరగనుంది.
మొత్తం 80 నిమిషాల పాటు ట్రంప్ న్యాయవాదులతో పాటు అవతలి పార్టీ న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. అనంతరం కోర్టు తీర్పు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తీర్పుతో ట్రంప్ మళ్లీ అధ్యక్షుడయ్యే అవకాశాలున్నాయా లేదా అన్నది తేలిపోనుంది.
కాగా, ట్రంప్ ఇప్పటికే ప్రారంభమైన ప్రైమరీ ఎన్నికల్లో అయోవా, న్యూ హ్యాంప్‌షైర్ నుంచి ఘన విజయం సాధించి రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి నామినేషన్ రేసులో హాట్ ఫేవరెట్‌గా మారారు.
Comments
Please login to add a commentAdd a comment