తైపీ: తైవాన్‌లో చైనా బెలూన్ తీవ్ర కలకలం సృష్టించింది. చైనా ప్రయోగించిన బెలూన్ తమ భూభాగంలో ల్యాండ్ అయ్యిందని తైవాన్ రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. చైనాలోని తైయువాన్ సిటీలో ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి చెందిన పరికరాలు ఇందులో ఉన్నట్లు గుర్తించామని పేర్కొంది. చైనాలో అంతర్భాగమైన ఫుజియాన్ ప్రావిన్స్ తీరానికి సమీపంలోని తమ మాత్సూ ఐలాండ్‌లో భాగమైన తూంగ్‌యిన్‌లో ఈ బెలూన్ నేలపైకి దిగినట్లు తెలియజేసింది. ఈ ఉదంతంపై చైనాలోని తైయువాన్ వైర్‌లెస్(రేడియో) ఫస్ట్ ఫ్యాక్టరీ లిమిటెడ్ అధికారి స్పందించారు.
ఆ బెలూన్‌లోని ఎలక్ట్రానిక్ పరికరాలు మాత్రమే తాము అందజేశామని, బెలూన్‌ను తాము తయారు చేయలేదని పేర్కొన్నారు. ఆ కంపెనీ చైనా వాతావరణ శాఖకు అవసరమైన పరికరాలను అందిస్తున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. తైవాన్ భూభాగంలో దిగిన బెలూన్ వాతావరణాన్ని పరిశీలించేందుకు ప్రయోగించినదేనని స్పష్టం చేశారు. ఇలాంటి బెలూన్లు తైవాన్ జలసంధిపై ఎగరడం సాధారణమేనని, ఇప్పుడు మాత్రమే దీనిపై అందరి దృష్టి పడిందని వివరించారు. చైనా బెలూన్‌ను ఇటీవల అమెరికా కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇరు దేశాల నడుమ మాటల యుద్ధం సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment