balloons issue
-
తైవాన్‌లో చైనా బెలూన్ కలకలం
తైపీ: తైవాన్‌లో చైనా బెలూన్ తీవ్ర కలకలం సృష్టించింది. చైనా ప్రయోగించిన బెలూన్ తమ భూభాగంలో ల్యాండ్ అయ్యిందని తైవాన్ రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. చైనాలోని తైయువాన్ సిటీలో ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి చెందిన పరికరాలు ఇందులో ఉన్నట్లు గుర్తించామని పేర్కొంది. చైనాలో అంతర్భాగమైన ఫుజియాన్ ప్రావిన్స్ తీరానికి సమీపంలోని తమ మాత్సూ ఐలాండ్‌లో భాగమైన తూంగ్యిన్లో ఈ బెలూన్ నేలపైకి దిగినట్లు తెలియజేసింది. ఈ ఉదంతంపై చైనాలోని తైయువాన్ వైర్లెస్(రేడియో) ఫస్ట్ ఫ్యాక్టరీ లిమిటెడ్ అధికారి స్పందించారు. ఆ బెలూన్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు మాత్రమే తాము అందజేశామని, బెలూన్ను తాము తయారు చేయలేదని పేర్కొన్నారు. ఆ కంపెనీ చైనా వాతావరణ శాఖకు అవసరమైన పరికరాలను అందిస్తున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. తైవాన్ భూభాగంలో దిగిన బెలూన్ వాతావరణాన్ని పరిశీలించేందుకు ప్రయోగించినదేనని స్పష్టం చేశారు. ఇలాంటి బెలూన్లు తైవాన్ జలసంధిపై ఎగరడం సాధారణమేనని, ఇప్పుడు మాత్రమే దీనిపై అందరి దృష్టి పడిందని వివరించారు. చైనా బెలూన్ను ఇటీవల అమెరికా కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇరు దేశాల నడుమ మాటల యుద్ధం సాగుతోంది. -
చైనా గగనతలంలో అమెరికా బెలూన్ల కలకలం!
బీజింగ్: నిఘా బెలూన్ల వ్యవహారంతో అమెరికా, చైనాల మధ్య పరిస్థితులు నానాటికీ ఉద్రిక్తతంగా మారుతున్నాయి. ఈ అంశంతో పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి ఇరు దేశాలు. అవి నిఘా బెలూనలు కాదని, సాధారణ పరిశోధనల కోసం ప్రయోగించిన బెలూన్లని, అమెరికా ఉత్తపుణ్యానికే కూల్చేసిందని చైనా మండిపడుతోంది. మరోవైపు అమెరికా మాత్రం చైనా బెలూన్ల వ్యవహారాన్ని సీరియస్‌గానే తీసుకుంటోంది. ఇక.. తాజాగా అమెరికాకు కౌంటర్ ఇచ్చింది చైనా. తమ గగనతలంలోనూ అమెరికా నిఘా బెలూన్స్ సంచరించాయని చైనా సోమవారం ఆరోపించింది. జనవరి 2022 నుంచి ఇప్పటిదాకా తమ గగనతలంలోకి ఏకంగా పది నిఘా బెలూన్లను అమెరికా పంపిందని పేర్కొంది. అక్రమంగా ఇతర దేశాల గగనతలంలోకి చొరబడడమూ అమెరికాకు కొత్తేం కాదు అంటూ చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ బెన్‌బిన్ పేర్కొన్నారు. చైనా అధికార యంత్రాంగం అనుమతులు లేకుండానే మా(చైనా) భూభాగంలోకి అమెరికా బెలూన్లు వచ్చాయి. మరి వాటి సంగతి ఏంటి?. అలాగని వాళ్లలాగా తొందరపాటు చర్యలకు మేం దిగబోం. ఈ పరిస్థితిని బాధ్యతాయుతంగా, ప్రొఫెషనల్‌గా హ్యాండిల్ చేస్తాం. చైనా గగనతలంలో అమెరికా ఎయిర్బెలూన్ల సంచారం గురించి అదనపు సమాచారం కావాలంటే.. వెళ్లి వాళ్లను(అమెరికా)ను ఓసారి సంప్రదించండి అంటూ వ్యాఖ్యానించారు వాంగ్ బెన్‌బిన్. ఈ ఆరోపణలపై అమెరికా స్పందించాల్సి ఉంది. -
భారత్ సహా ఆ దేశాలపై చైనా బెలూన్ నిఘా.. జిన్‌పింగ్ ప్లాన్ ఏంటి?
వాషింగ్టన్: డ్రాగన్ దేశం చైనా నిఘా బెలూన్ల ఉదంతం ప్రపంచవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. చైనా ఈ బెలూన్లతో కేవలం అమెరికా పైనే కాదు, ఇంకా చాలా దేశాలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. చైనా బెలూన్లు భారత్‌ను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికాకు చెందిన ‘ద వాషింగ్టన్ పోస్టు’ పత్రిక ఒక కథనంలో వెల్లడించింది. భారత్‌తోపాటు జపాన్, వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్‌లో ఉన్న కీలక వ్యూహాత్మక ప్రాంతాలను చైనా బెలూన్లు టార్గెట్ చేసినట్లు కథనంలో బహిర్గతం చేసింది. చైనా వైమానిక దళం నిఘా బెలూన్లను నిర్వహిస్తోందని, ఇవి ఐదు ఖండాలపై కనిపించినట్లు తెలియజేసింది. తన గగనతలంపై ఎగురుతున్న చైనా బెలూన్ను ఇటీవలే అమెరికా పేల్చేసిన∙సంగతి తెలిసిందే. ఇతర దేశాలపై నిఘా కోసం చైనా ఈ బెలూన్లను తయారు చేసిందని, తద్వారా ఆయా సార్వభౌమత్వానికి విఘాతం కలిగించిందని అమెరికా రక్షణ శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు బెలూన్ల వ్యవహరంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంతకుముందు చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ తమకు చైనా నుంచి ప్రమాదం పొంచి ఉంటే, అప్పుడు దేశాన్ని రక్షించుకునేందుకు సరైన రీతిలో స్పందిస్తామని అన్నారు. దానికి తగినట్లే వ్యవహరించామని కూడా ఆయన తెలిపారు. తాజాగా బైడెన్ మాట్లాడుతూ.. చైనాతో జరుగుతున్న వ్యాపార పోరాటంలో గెలుపు అనేది అందర్నీ కలపాలని, ప్రపంచవ్యాప్తంగా తమ దేశానికి ఎన్నో సవాళ్లు ఉన్నాయని, గత రెండేళ్లలో ప్రజాస్వామ్యాలు బలపడ్డాయని, కానీ బలహీనపడలేదని బైడెన్ తెలిపారు. అమెరికా ప్రయోజనాల కోసం చైనాతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామన్నారు. చైనాతో తాము పోటీనే కోరుకుంటున్నాము కానీ.. ఘర్షణలు కాదు అనే విషయాన్ని ఇప్పటికే జిన్‌పింగ్‌కు అర్థమయ్యేలా చెప్పినట్టు కామెంట్స్ చేశారు. -
గాల్లో గూఢచారులు: స్పై బెలూన్లు... కథా కమామిషు
ఓ బెలూన్ కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అమెరికా గగనతలంపై 60 వేల అడుగుల ఎత్తున ఎగురుతూ కన్పించిన ఈ చైనా బెలూన్ కచ్చితంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను భారీగా పెంచేసింది. అది కచ్చితంగా నిఘా బాపతేనని అమెరికా, వాతావరణ పరిశోధనలు చేస్తూ దారి తప్పిందని చైనా వాదిస్తున్నాయి. సైనిక రంగంలో నిఘా బెలూన్ల వాడకం ఈ ఉదంతంతో మరోసారి తెరపైకి వచ్చింది... ఈ కాలంలోనూ అవసరముందా? సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతూ ఉపగ్రహాలు, డ్రోన్లు అందుబాటులోకి వచ్చాక ఈ నిఘా బెలూన్లతో పనేమిటన్న సందేహాలు సహజం. కానీ ఇప్పటికీ మిలటరీలో ఈ బెలూన్లకు ఎంతో ప్రాధాన్యముంది. ఉపగ్రహాలతో పోలిస్తే వీటిని చాలా చౌకలో తయారు చేయొచ్చు. నిర్ధిష్ట గగన తలాలకు పంపడమూ ఎంతో సులభం. గాలివాటానికి అనుగుణంగా బెలూన్ల దిశను మార్చవచ్చు. అత్యంత ఎత్తులో ప్రయాణించే ఈ బెలూన్లు సేకరించే సమాచారం, ఫొటోలు చాలా నాణ్యతతో ఉంటాయి. లక్షిత గగనతలాల్లో రోజుల తరబడి ప్రయాణించే సత్తా వీటికుంది. చైనా ప్రయోగం వెనక... అమెరికా, చైనా మధ్య తరచూ ఉద్రిక్తతలు నెలకొంటూనే ఉన్నాయి. తైవాన్ నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు, చైనాలో మానవహక్కుల నుంచి హాంగ్‌కాంగ్‌లో ప్రజాస్వామ్యం నిర్వీర్యం చేసే చర్యల దాకా తరచూ ఘర్షణాత్మక వాతావరణం నెలకొంటూనే ఉంది. కొంతకాలం క్రితం అప్పటి అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ సందర్శన నాటి నుంచీ విభేదాలు మరింత ముదిరాయి. చైనా 34 యుద్ధ విమానాలను,, 9 యుద్ధ నౌకలను దక్షిణ చైనా సముద్రంలో మోహరించింది. ప్రతిగా తైవాన్ కూడా యుద్ధ విమానాల్ని సన్నద్ధం చేయడం, తైవాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించడం ఉద్రిక్తతల్ని పెంచింది. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ చైనా పర్యటనకు కొద్ది రోజుల ముందే చైనా నిఘా బెలూన్ ఇలా అమెరికా గగనతలంలోకి ప్రవేశించి కలకలం రేపింది. తద్వారా అగ్రరాజ్యానికి చైనా ఓ రకంగా హెచ్చరికలు పంపిందని భావిస్తున్నారు. ఎప్పట్నుంచి వాడుకలో ఉన్నాయి? ► ఈ బెలూన్లను ఫ్రెంచి విప్లవం కాలం నుంచే వాడుతున్నారు. యుద్ధ భూమిలో ఆస్ట్రియా, డచ్ సైనిక దళాల కదలికలు తెలుసుకునేందుకు 1794లో ఫ్రాన్స్ వీటిని తొలిసారి వాడింది. ► గాల్లో చాలా ఎత్తున ఎగిరే ఈ బెలూన్ల ద్వారా సమాచార సేకరణ తేలిక కావడంతో అమెరికా అంతర్యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వీటి వాడకం పెరిగింది. ► రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఒక అడుగు ముందుకేసి ప్రత్యర్థులపై ఈ బెలూన్లతో బాంబు దాడులకు దిగిన సందర్భాలూ ఉన్నాయి! జపాన్ సైన్యం ప్రయోగించిన బెలూన్ బాంబు అమెరికాలో ఒరెగాన్ వుడ్‌ల్యాండ్‌లో పడి ముగ్గురు పౌరులు మరణించారు. ► రెండో ప్రపంచ యుద్దం తర్వాత ప్రాజెక్ట్ జెనెట్రిక్స్ పేరుతో అమెరికా ఈ బెలూన్లపై విస్తృతంగా ప్రయోగాలు చేసింది. 1950లో వీటి సాయంతో సోవియట్ భూభాగాన్ని ఫొటోలు తీసింది. ► అమెరికా ఆర్మీ ప్రాజెక్టు మొగల్ పేరుతో బెలూన్లకు మైక్రోఫోన్లను అమర్చి సోవియట్ యూనియన్ అణు పరీక్షలకు సంబంధించిన శబ్దాలను రికార్డు చేసింది. ఏమిటీ నిఘా బెలూన్లు? నిఘా బెలూన్లను అత్యంత తేలికైన హీలియం వాయువుతో నింపుతారు. కెమెరాలు, రాడార్లు, సెన్సార్లు, కమ్యూనికేషన్ పరికరాలు అమర్చుతారు. అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలు సుదూర ప్రాంతాల్లోని సమాచారాన్ని కూడా అత్యంత స్పష్టతతో సేకరించగలవు. ప్రయాణికుల విమానాలు 40 వేల అడుగుల ఎత్తు దాటవు. ఈ స్పై బెలూన్లు భూమికి 60 వేల నుంచి, లక్షా 50 వేల అడుగుల ఎత్తులో రోజుల తరబడి ప్రయాణించే సామర్థ్యం కలిగినవి. స్పై బెలూన్లు... కథా కమామిషు ► ప్రచ్ఛన్న యుద్ధ తొలినాళ్లలో వీటిని విరివిగా వాడారు ► అత్యంత ఎత్తుల్లో రాడార్లకూ చిక్కకుండా వెళ్లగలవు ► సౌర పలకలు ► నిఘా పరికరాలు ► గాలివాటంగా కదులుతాయి ► కిందివైపు కెమెరా ఉంటుంది ► రాడార్ వ్యవస్థలను అనుసంధానించవచ్చు ► 24వేల నుంచి 37వేల మీటర్ల ఎత్తులో ప్రయాణించగలవు – సాక్షి, నేషనల్ డెస్క్ -
చిత్తూరులో చిచ్చురేపిన బెలూన్ల గొడవ!
చిత్తూరు జిల్లా నగరి ప్రాంతంలో బెలూన్ల వ్యవహారం చిచ్చు రేపింది. ఈ గొడవల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారు. దీంతో మునిసిపల్ చైర్పర్సన్ శాంతకుమారితో పాటు మరికొంతమందికి ఈ దాడిలో తీవ్ర గాయాలయ్యాయి. తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యకాండపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచే చిత్తూరు జిల్లాలో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు రెచ్చిపోతున్నారు. తిరుమల పుణ్యక్షేత్రం మీద కూడా ఆగడాలకు పాల్పడిన చరిత్ర ఉంది. ఇప్పుడు తాజాగా చిత్తూరు జిల్లా నగరిలో బెలూన్ల విషయంలో గొడవ పెట్టుకుని దాడులకు పాల్పడుతున్నారు.