బాలల హక్కుల కోసం పోరాడుతున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాల యూసఫ్ జాయ్‌కు మరోసారి బెదిరింపు సందేశాలు వచ్చాయి. ఈ సారి తమ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేవంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తొమ్మిదేళ్ల క్రితం మలాల మీద కాల్పులు జరిపిన పాకిస్తాన్ తాలిబన్ సంస్థ, మరోసారి ఈ మేరకు బెదిరింపులు జారీ చేసింది. అయితే, ఇందుకు సంబంధించిన ట్వీట్‌పై బుధవారం నిషేధం విధించారు. కాగా 15 ఏళ్ల వయసులోనే బాలికల విద్య కోసం పోరాడిన మలాల మీద 2012లో పాకిస్తాన్‌లో తాలిబాన్ మిలిటెంట్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో మూడు బుల్లెట్లు ఆమె శరీరంలోకి వెళ్లగా తీవ్రంగా గాయపడింది. ఇప్పుడు ఆమె వయసు 23 ఏళ్లు.
పాకిస్తాన్ తాలిబాన్ సభ్యుడు ఎహ్సాన్.. ‘నీతో, మీ నాన్నతో సెటిల్ చేసుకునే విషయాలు చాలా ఉన్నాయి. ఇందుకు నువ్వు వెంటనే ఇంటికి తిరిగి రావాలని కోరుతున్నా. ఈసారి ఏ విధంగానూ తప్పించుకోలేవు. చంపేస్తాం’ అని ఓ సందేశం పోస్ట్ చేశాడు. దీనిపై మలాల స్పందిస్తూ.. ‘‘ఇతను నాతోపాటు చాలా మంది అమాయక ప్రజలపై దాడి చేసిన తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ మాజీ ప్రతినిధి. అతను ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రజలను బెదిరిస్తున్నాడు. అతను ఎలా తప్పించుకున్నాడు’’ అని ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను, అదే విధంగా సైన్యాన్ని ప్రశ్నించింది.
కాగా ఎహ్సాన్‌ను 2017లో అరెస్టు చేశారు. అయితే 2020 జనవరిలో అతన్ని పట్టుకున్న పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నుంచి తప్పించుకున్నాడు. అంతేగాక అతని అరెస్టు, తప్పిదం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. ఎహ్సాన్ తప్పించుకున్న అనంతరం ఇదే ట్విటర్ అకౌంట్ ద్వారా పాకిస్తాన్ జర్నలిస్టులకు ఇంటర్వ్యూ ఇస్తూ టచ్‌లో ఉన్నాడు. అయితే ఈ అకౌంట్లపై ప్రస్తుతం నిషేధం విధించారు. ఇక మలాలకు వచ్చిన హెచ్చరికలపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని ప్రధాని సలహాదారు రౌఫ్ హసన్ తెలిపారు. కాగా అనేక సంవత్సరాలు సైనిక కస్టడీలో ఉన్న ఎహ్సాన్ వారి నుంచి ఎలా తప్పించుకున్నాడో, అక్కడి నుంచి టర్కీకి ఎలా వెళ్లాడో కూడా అధికారులు వెల్లడించలేదు.
చదవండి: పెళ్ళికూతురు డాన్స్..అంతలోనే విషాదం..
ఏడాది తర్వాత కనిపించిన కిమ్ జోంగ్ ఉన్ భార్య
Comments
Please login to add a commentAdd a comment