కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల దురాక్రమణ జోరందుకుంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ముఖ్య నగరాలను శరవేగంతో స్వాధీనం చేసుకుంటున్నారు. దేశంలో రెండో అతి పెద్ద నగరమైన కాందహార్‌ను ఆక్రమించుకున్నారు. దక్షిణాది ఆర్థిక హబ్‌గా పేరున్న కాందహార్‌లో గురువారం రాత్రి తాలిబన్లు, అఫ్గాన్ సైన్యానికి మధ్య భీకర ఘర్షణ జరిగింది. అర్ధరాత్రి దాటాక తాలిబన్లు కాందహార్‌ని స్వాధీన పరచుకొని ప్రభుత్వ కార్యాలయాలపై తాలిబన్ జెండాలు ఎగురవేసినట్టు అధికారులు చెప్పారు. మరో వారంలో రాజధాని కాబూల్ సహా మొత్తం దేశం తమ వశమవుతుందని తాలిబన్ల ప్రతినిధి ఒకరు చెప్పారు.
తాము విదేశీ సంస్థలపై దాడులకు దిగబోమని, ఈ సంక్షోభం సమయంలో అన్ని దేశాలు తమకు సహకరించాలని ఆ ప్రతినిధి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అఫ్గాన్ దక్షిణ భాగమంతా తాలిబన్ల పెత్తనం కిందకు వచ్చేసింది. కాబూల్‌కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న హెల్మాండ్ నగరాన్ని ఆక్రమించుకోవడంతో ఇక దేశం యావత్తూ వారి చేతుల్లోకి వెళ్లిపోవడం ఎంతో దూరం లేదనే ఆందోళన పెరుగుతోంది. ఘాజ్నీ, హెరత్, లోగర్, ఫెరోజ్ కోహ్ వంటి కీలక నగరాల్లోనూ తాలిబన్లు పాగా వేశారు. ఆయా నగరాల్లోని స్థానిక నేతలు తాలిబన్ల ఎదుట లొంగిపోయారు. అమెరికా తుది విడత బలగాలను ఉపసంహరించడానికి వారం ముందే దేశంలో 66% భూభాగం తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయింది. దేశంలో 34 ప్రావిన్షియల్ రాజధానులు ఉండగా, సగం రాజధానులను ఇప్పటికే ఆక్రమించారు. కాబూల్‌కు 80 కిలోమీటర్ల దూరంలోని లోగర్ ప్రావిన్స్‌లో ఇరుపక్షాల మధ్య ఘర్షణ కొనసాగుతోంది.
అమెరికా, యూకే సిబ్బంది వెనక్కి
తాలిబన్లు రెచ్చిపోతుండగా పశ్చిమ దేశాలు తమ దౌత్య కార్యాలయాలను మూసేస్తూ, సిబ్బంది వెనక్కి తీసుకువస్తున్నారు. అమెరికా, బ్రిటన్, కెనడా అవే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి.
ఐరాస ఆందోళన
అఫ్గానిస్తాన్‌లో రోజురోజుకూ మారుతున్న పరిణామాలపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటేరస్ ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య దోహాలో జరిగే చర్చలతో సంక్షోభం పరిష్కారమవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. అధికారాన్ని కలిసి పంచుకుందామని అధ్యక్షుడు ఘనీ తాలిబన్లకు ప్రతిపాదనలు పంపిన సంగతి తెలిసిందే.
మహిళలపై వేధింపులు షురూ
అఫ్గానిస్తాన్‌పై పట్టు బిగిస్తున్న తాలిబన్ల అరాచకాలు మళ్లీ మొదలయ్యాయి. బందీలుగా చిక్కిన అఫ్గాన్ సైనికుల్ని ఉరి తీయడం, తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోని పెళ్లి కాని అమ్మాయిల్ని ఉగ్రవాదులకు కట్టబెట్టాలని చూడడం వంటి పనులు చేస్తున్నట్టుగా మానవ హక్కుల సంఘాలు చెప్పినట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. తమ వల్ల ఎవరికీ ఎలాంటి హానీ ఉండదని పదే పదే ప్రకటిస్తున్న తాలిబన్లు విరుద్ధంగా ప్రవరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment