గురువారం కాబూల్‌లో నిరసనకారులను హెచ్చరిస్తున్న తాలిబన్లు
కాబూల్: అఫ్గానిస్తాన్ స్వాతంత్య్రదినోత్సవాన నీలాల నింగి నిండుగా జాతీయ పతాకం ఆవిష్కృతం కావడానికి బదులుగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు హోరెత్తిపోయాయి. తాలిబన్లకు వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేయడానికి స్వాతంత్య్రదినాన్ని ప్రజలు ఒక అవకాశంగా తీసుకున్నారు. అఫ్గాన్ జెండా చేతపట్టుకొని వీధుల్లోకి వచ్చి ‘మా పతాకమే మాకు గుర్తింపు’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. దీంతో ఈ ర్యాలీలపై తాలిబన్లు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో పలువురు మృతి చెందగా, ఎందరికో గాయాలయ్యాయి. అయితే ఎంత మంది మరణించారన్న దానిపై స్పష్టమైన సమాచారమేదీ లేదు. దేశంలోని పలు నగరాల్లో ఇవే దృశ్యాలు కనిపించాయి. ఈ ఘటనలపై తాలిబన్లు పెదవి విప్పలేదు. 1919 ఆగస్టు, 19న బ్రిటీష్ వలసపాలకుల నుంచి అఫ్గానిస్తాన్‌కు విముక్తి లభించింది. అప్పట్నుంచి ప్రతీ ఏటా స్వాతంత్య్రదిన వేడుకలు జరుపుకుంటారు. ఈ ఏడాది తాలిబన్లు అఫ్గాన్‌ను వశం చేసుకోవడంతో వారి అరాచకాలను నిరసిస్తూ ప్రజలు రోడ్డెక్కారు. ప్రజల నిరసనల్ని అడ్డుకున్న తాలిబన్లు వారిపై తమ ప్రతాపం చూపించారు.
కాబూల్‌లో కార్ల ర్యాలీ
కాబూల్‌లో నిరసనకారులు కార్లకి ఎరుపు, నలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన జాతీయ జెండాని కట్టి ర్యాలీ తీశారు. ఈ నిరసనల్లో మహిళలు కూడా పాల్గొన్నారు. (మా కంటి పాపలనైనా కాపాడండి; అఫ్గాన్‌లో హృదయ విదారకర దృశ్యాలు)
తాలిబన్ల జెండా చించేసిన నిరసనకారులు
అసదాబాద్‌లో తాలిబన్ల జెండాను చించి పడేసి, జాతీయ జెండాను మోసుకుంటూ వెళుతున్న నిరసనకారులపై తాలిబన్లు కాల్పులు జరిపారు. ప్రాణభయంతో ప్రజలు అటూ ఇటూ పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించినట్టుగా అల్‌జజీరా చానెల్ వెల్లడించింది. ఈ ర్యాలీలకు వందలాది మంది హాజరయ్యారు.
ఖోస్ట్‌లో కర్ఫ్యూ
దేశంలోని జలాలాబాద్, ఖోస్ట్, పకటియా, నాన్‌గర్‌హర్‌లలో తాలిబన్లకు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తిపోయాయి. ఖోస్ట్‌లో వందలాది మంది ప్రజలు బయటకు వచ్చి జాతీయ జెండాను ఎగురవేయడానికి ప్రయత్నించారు. తాలిబన్లు వారిని అడ్డుకొని కాల్పులు జరపడంతో హింస చెలరేగింది. ఖోస్ట్‌లో కర్ఫ్యూ విధించారు.
Comments
Please login to add a commentAdd a comment