కరోనా పుట్టుకకు కారణమైందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేల.. ఇప్పుడు అదే వైరస్‌తో మరణమృదంగాన్ని చవిచూస్తోంది. వైరస్ బారిన పడి జనాలు కోకొల్లలుగా మరణిస్తున్నారు. ఐసీయూలన్నీ పేషెంట్లతో నిండిపోతున్నాయి. అయినవాళ్ల అంత్యక్రియల కోసం శ్మశానాల వద్ద జనాలు బారులు తీరుతున్నారు. రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం కరోనా విషయంలో కాకి లెక్కలు చెప్తోంది!.
దేశంలో ఇప్పటిదాకా నమోదు అయిన కరోనా కేసులు.. 3,97,195. మరణాల సంఖ్య 5,241. కోలుకున్న వాళ్ల సంఖ్య 3,50,117. ఇది చైనా ప్రభుత్వం చెప్తున్న అధికారిక లెక్కలు. జీరో కోవిడ్ పాలసీ పేరుతో మూడేళ్ల పాటు.. వైరస్‌ను కట్టడి చేయగలిగిన చైనా, జన జీవనంతో ఆటాడుకుంది. అయితే ఆ పాలసీ బెడిసి కొట్టింది. వ్యాక్సినేషన్ మీద దృష్టి పెట్టకపోవడం, అందుకు సంబంధించిన పరిశోధనలు సజావుగా సాగకపోవడంతో.. కొత్త వేరియెంట్‌లు విరుచుకుపడ్డాయి. చివరికి.. చేసేది లేక చేతులెత్తేసింది ప్రభుత్వం. ప్రపంచానికి ఘనంగా పరిచయం చేసుకున్న జీరో కొవిడ్ పాలసీ ఘోరంగా బెడిసి కొట్టింది. అధికారంగా ఫస్ట్ వేవ్‌ను ఎదుర్కొంటోంది ఆ దేశం. అదీ ప్రపంచంలో ఏ దేశం కరోనాతో ఇంత భయానకమైన పరిస్థితిని ఎదుర్కొలేనంత దారుణంగా!.
అత్యధిక జనాభా ఉన్న దేశంలో.. కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఆస్ప్రతుల్లో కరోనా బాధితులకు బెడ్స్ దొరకడం లేదు. ఎక్కడ పడితే అక్కడ పేషెంట్లకు చికిత్స అందించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్లను తీసుకెళ్తున్న ఆంబులెన్స్‌లు.. ఆస్పత్రుల నిరాకరణతో సుదూర ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో మరణాలూ సంభవిస్తున్నాయి. బీజింగ్ నైరుతి భాగంతో పాటు నగరాలు, పలు పట్టణాల్లో ఎమర్జెన్సీ వార్డులు ఇసుకేస్తే రాలనంత జనం క్యూకడుతున్నారు. డిసెంబర్ 7వ తేదీ నుంచి ఇప్పటిదాకా కేవలం ఏడుగురు మాత్రమే కరోనాతో చనిపోయారని ప్రకటించుకుంది అక్కడి ప్రభుత్వం. కానీ, పేషెంట్లు కిక్కిరిసిపోవడంతో పాటు మరణాలు అంతే వేగంగా సంభవిస్తున్నాయని అక్కడి ఫ్రీలాన్స్ జర్నలిస్టులు కథనాలు ప్రచురిస్తున్నారు.
కరోనా సోకిన వాళ్లు న్యూమోనియా, శ్వాసకోశ సమస్యలతో మరణిస్తేనే.. అది కరోనా మరణం కిందకు వస్తుందంటూ మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసే ఉంటుంది. ఇదంతా మరణాల లెక్కలను దాచేందుకు చేస్తున్న ప్రయత్నం అని స్పష్టంగా తెలుస్తోంది. దీంతో వైరస్ సోకి.. చికిత్సలో మరణిస్తున్నా కూడా అది కరోనా మరణాల కిందకు రావడం లేదు. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు కూడా.
కేవలం ఆక్సిజన్ సరఫరాకు మాత్రమే కాదు.. కరెంట్ సరఫరా కూడా కొరత నడుస్తోంది చైనాలోని పలు ప్రావిన్స్‌లో. చైనా ప్రకటించుకున్న మరణాల లెక్క తప్పని చెప్పే మరో ఉదాహరణ. జువోజూ ప్రావిన్స్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని గావోబెయిడియాన్‌లోని స్మశానానికి.. బీజింగ్ నుంచి శవాల వాహనాలు క్యూ కడుతున్నాయి. కానీ, నిర్వాహకులు మాత్రం పది రోజుల పాటు వేచి చూడాలని చెప్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో.. వాహనాల్లోనే ఐస్‌బాక్సుల్లో శవాలను ఉంచుతున్నారు.
ఎంతో మంది చనిపోతున్నారని చెప్తున్నాడు ఆ వాటికలోనే పని చేసే జావో యోంగ్‌షెంగ్ అనే వ్యక్తి. రాత్రింబవలు పని చేస్తున్నా.. తమ పనిని పూర్తి చేయలేకపోతున్నామని వాపోతున్నాడతను. చైనాలో అత్యధిక జనాభా వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంది. కరోనా సోకదనే ధైర్యం.. ఒకవేళ సోకినా రోగనిరోధక శక్తి ద్వారా ఎలాగోలా నెట్టుకు రావొచ్చు.. అన్నింటికి మించి ప్రభుత్వం కఠినంగా అమలు చేసిన లాక్‌డౌన్ వల్ల నానా ఇబ్బందులు వాళ్లను తీవ్ర నిర్ణయాలు తీసుకునేలా చేశాయి.
‘‘ఈ దశలో మనం(భారత్) ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, చైనా తీవ్రత చూసైనా మేలుకుందాం. కరోనా విషయంలో అప్రమత్తంగా ఉందాం. అత్యవసరంగా వ్యాక్సినేషన్‌లో పాల్గొనండి. మాస్క్ ధరించడం, అనవసర ప్రయాణాలను తప్పించడం.. తగు జాగ్రత్తలు పాటిస్తేనే.. వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. అంతా సురక్షితంగా ఉండొచ్చు అని టాటా ఇనిస్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్‌మిశ్రా చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment