ప్రభుత్వంపై ఆగ్రహంతో రోడ్డెక్కిన లక్షలాది మంది
వరదల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ స్పెయిన్‌లో లక్షలాది మంది రోడ్డెక్కారు. ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారంటూ వాలెన్సియాలో శని, ఆదివారాల్లో ఆందోళనకు దిగారు. వాలెన్సియా రీజనల్ హెడ్ కార్లోస్ మజోన్ రాజీనామాకు డిమాండ్ చేశారు. దాదాపు 1,30,000 మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. వాలెన్సియా సిటీ హాల్‌ను బురదతో నింపేశారు. కురీ్చలు, వస్తువులకు నిప్పు పెట్టారు. పలుచోట్ల పోలీసులతో ఘర్షణకు దిగారు. వాలెన్సియా, పరిసర ప్రావిన్సుల్లో ఇటీవల కుండపోత వర్షాలకు వరద ముంచెత్తి 200 మందికి పైగా మరణించడం తెలిసిందే.
80 మందికి పైగా గల్లంతయ్యారు. వేలాది మంది నిర్వాసితులయ్యారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ వీధులు బురద, శిథిలాల్లో కూరుకుపోయి ఉన్నాయి. స్పెయిన్ వాతావరణ సంస్థ అక్టోబర్ 25 నుంచే ఈ ప్రాంతానికి తుపాను హెచ్చరికలు జారీ చేసినా వరదలు మొదలయ్యే దాకా వాలెన్సియా అధికారులు ప్రజలను అప్రమత్తం చేయలేదు. వారి అలసత్వం వల్లే భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని జనం మండిపడుతున్నారు. గత వారం పైపోర్టా పట్టణాన్ని సందర్శించిన స్పెయిన్ రాజు, రాణిపైనా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. అనంతరం ప్రధాని పెడ్రో సాంచెజ్‌పై గుడ్లు తదితరాలు విసిరి నిరసన తెలిపారు.
– వాలెన్సియా
Comments
Please login to add a commentAdd a comment