‘‘జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందుకే జీవితమంటే ప్రతీ క్షణాన్ని ఆస్వాదించడమే. మామూలు వాళ్లైనా సరే.. వైకల్యం ఉన్న వాళ్లైనా సరే ఏదో ఒకటి సాధించాలని అందరికీ ఉంటుంది. అలాంటప్పుడు ముందుకెళ్లకుండా.. వెనక్కి తిరిగి చూడడం ఎందుకు? నా విషయంలో నేను చేస్తున్న పని ఎంతో ఆనందాన్ని ఇస్తోంది’’ అంటూ ముసిముసి నవ్వులతో చెబుతోంది టిక్‌టాకర్ మేఘనా గిమిరే. కరెంట్ షాక్‌తో రెండు చేతులు పొగొట్టుకున్న ఈమెలోని ఆత్మవిశ్వాసం.. అన్నీ ఉన్నా సాధించడానికి బద్ధకించేవాళ్లకు ఒక మంచి పాఠం.
వెబ్‌డెస్క్: నేపాల్‌కు చెందిన మేఘనా గిమిరే. కొన్నేళ్ల క్రితం ప్రేమించిన వ్యక్తిని పెద్దలకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన పది నెలల తర్వాత ఓరోజు ఆమె ఘోర ప్రమాదానికి గురైంది. చేతికి ఇనుప గాజులు వేసుకోవడం, దగ్గర్లో ఉన్న హైటెన్షన్ వైరను పొరపాటున తాకడంతో ఆమె కరెంట్ షాక్‌కు గురైంది. చేతులు పూర్తిగా దెబ్బతినడంతో డాక్టర్లు సర్జరీ చేసి వాటిని తీసేశారు. అందమైన భార్య వికలాంగురాలు అయ్యేసరికి సహించలేక ఆ భర్త వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మేఘన ఇబ్బందుల్ని ఎదుర్కొంది.
నడిపించిన తల్లి ప్రేమ
భర్త వదిలేసినా.. కన్నపేగు మమకారం మేఘనను అక్కున చేర్చుకుంది. పుట్టింటికి తీసుకొచ్చింది. తినబెట్టడం, బట్టలు మార్చడం, స్నానం అన్నీ తల్లే దగ్గరుండి చేసింది. కొన్నాళ్లకు తనంతట తానుగా పనులు చేసుకోవడం ప్రారంభించింది గిమిరే. క్రమంగా కాళ్ల సాయంతో పనులు చేయడం మొదలుపెట్టింది. ఒకరోజు సరదాగా మొబైల్‌ను కాళ్లను ఆపరేట్ చేస్తూ.. తన పాత టిక్‌టాక్ అకౌంట్‌ను చూసింది. సెల్ఫ్ వీడియోలతో టిక్‌టాక్‌లో వీడియోలు అప్లోడ్ చేసింది. ఆ వీడియోల్లో ఆమె ఆత్మవిశ్వాసానికి లక్షల మంది ఫిదా అయ్యారు. తక్కువ టైంలోనే మేఘన టిక్‌టాక్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం టిక్‌టాక్‌లో ఆమెకు ఇరవై లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇండియాలో టిక్‌టాక్ బ్యాన్ కాకముందు మన దగ్గరి నుంచి కూడా ఆమె వీడియోలకు మంచి స్పందనే దక్కేది.
#Nepal #Tiktoker #Meghana pic.twitter.com/0VPf705VRK
— ashwik (@ursashwik) June 3, 2021
అభిమానుల అండ
సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోయింగ్ బాగా పెరిగింది. అయితే రాను రాను ఆ అభిమానులే.. ఆమె పట్ల దాతలుగా మారారు. వాళ్లు అందించిన డబ్బు సాయంతోనే ఆమె అమెరికా వెళ్లగలిగింది. అక్కడి డాక్టర్ల పర్యవేక్షణలో ప్రోస్తటిక్ చేతుల్ని అందుకుంది. కానీ, అవి ఆమెకు తాత్కాలిక ఊరట మాత్రమే అందించాయి. అయినప్పటికీ తనకు ఇప్పటిదాకా అందిన సాయం మరువలేనిదని చెబుతోంది మేఘన. చిరునవ్వుతో ఆమె చేసే సరదా వీడియోలే కాదు.. సందేశాలతో ఆమె మాట్లాడే మాటలు ఆకట్టుకునేలా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment