వైట్‌హౌస్ తొలి అధికారిని నియమించిన ట్రంప్
అమెరికా చరిత్రలోనే సూజీ తొలి మహిళా అధికారి
ప్రచార నిర్వాహకురాలిగా ఎన్నికల్లో గెలిపించారని ట్రంప్ ప్రశంస
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌కు తొలి అధికారి నియామకాన్ని ప్రకటించారు. తన ప్రచార మేనేజర్ సూజీ వైల్స్‌ను వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమిస్తున్నట్లు గురువారం వెల్లడించారు. 67 ఏళ్ల వైల్స్ అమెరికా చరిత్రలో ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించనున్నారు.
‘అమెరికా చరిత్రలో గొప్ప రాజకీయ విజయాన్ని సాధించడానికి సూజీ వైల్స్ నాకు సాయపడ్డారు. 2016లో, 2020లో, ఇప్పుడు నా ప్రచారంలో అంతర్భాగంగా ఉన్నారు. ఆమె కఠినమైన, తెలివైన, సృజనాత్మకమైన వ్యక్తి. అమెరికా చరిత్రలో తొలి మహిళా చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా సూజీని నియమించడం గౌరవంగా భావిస్తున్న’ అని ట్రంప్ వెల్లడించారు. ఇది గొప్ప వార్తని ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్ హర్షం వ్యక్తం చేశారు. ప్రచారంలో కీలక పాత్ర పోషించిన సూజీ వైట్‌హౌస్‌లోనూ అంతే కీలకంగా పనిచేస్తారని తెలిపారు.
ఎవరీ సూజీ వైల్స్?
సూజీ వైల్స్.. నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్‌ఎ ఫ్‌ఎల్) ఆటగాడు, స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్ పాట్ సమ్మరల్ కుమార్తె. 1957 మే 14న జన్మించిన ఆమె.. న్యూయార్క్ రిపబ్లికన్ జాక్ కెంప్ అధ్యక్షుడిగా ఉన్నసమయంలో వైట్‌హౌస్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. 1980లలో రోనాల్డ్ రీగన్ అధ్యక్ష ప్రచార బృందంలో చేరారు. ఇది జాతీయ రాజకీయాల్లో ప్రత్యక్ష ప్రమేయానికి నాంది పలికింది.
రీగన్ అధ్యక్ష ఎన్నికల ప్రచారం తరువాత పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా ఆమె ఫ్లోరిడాకు వెళ్లారు. అక్కడ ఆమె ఇద్దరు జాక్సన్‌విల్లే మేయర్లకు సలహాదారుగా పనిచేశారు. వ్యాపారవేత్త అయిన రిక్ స్కాట్ గవర్నర్‌గా గెలిచేందుకు తోడ్పడ్డారు. 2012లో ఉటా గవర్నర్ జాన్ హంట్స్‌మన్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. అదే ఆమెకు మరోమారి వైట్‌హౌస్‌కు బాటలు వేసింది. 2016లో డోనాల్డ్ ట్రంప్ ప్రచార బృందానికి నాయకత్వం వహించారు. ఆ తరువాత 2018లో ఫ్లోరిడా గవర్నర్‌గా రాన్ డిశాంటిస్ గెలుపులోనూ సూజీ కీలక పాత్ర పోషించారు.
ఇదీ చదవండి: ముంచింది బైడెనే..
Comments
Please login to add a commentAdd a comment