న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఉపాధ్యక్షురాలు, ఇండో అమెరికన్ కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ప్రచారంలో భాగంగా సెప్టెంబర్ 10న జరిగే డిబేట్‌పై ఇప్పటికే కసరత్తు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కమలా హారిస్‌పై పైచేయి సాధించాలనే ఉద్దేశంతో ట్రంప్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ తన అధ్యక్ష డిబేట్‌కు సన్నద్దం కోసం మాజీ డెమోక్రటిక్ నేత తులసి గబ్బర్డ్ సాయం తీసుకుంటున్నారని న్యూయార్ టైమ్స్ కథనం వెల్లడించింది.
ట్రంప్ తన ప్రైవేట్ క్లబ్ హోమ్ మార్-ఎ-లాగోలో డిబేట్ కోసం ప్రాక్టిస్ మొదలు పెట్టారు. అయితే ఈ ప్రాక్టిస్ సెషన్‌లో తులసి గబ్బర్డ్ చేరినట్లు పేర్కొంది. అయితే తులసి గబ్బర్డ్ డిబేట్ ప్రాక్టిసులో పాల్గొన్నట్లు ట్రంప్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ ధృవీకరించినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ‘‘ మొదటి డిబేట్‌లో ప్రెసిడెంట్ జో బిడెన్‌పై ట్రంప్ పైచేయి సాధించారు. దీంతో చరిత్రలో అత్యుత్తమ డిబేటర్లలో ట్రంప్ ఒకరిగా నిరూపించబడ్డారు. మామూలుగా అయితే ట్రంప్‌కు డిబేట్ ప్రిపరేషన్ అవసరం లేదు. కానీ, 2020లో జరిగిన డిబేట్ స్టేజ్‌లో కమలా హారిస్‌ను తులసి గబ్బర్డ్ విజయవంతంగా ఓడించారు. అందుకే అటువంటి పాలసీ అడ్వైజర్లు, ప్రభావవంతమైన కమ్యూనికేటర్ల సాయం తీసుకోవటం జరుగుతోంది’’ అని ట్రంప్ ప్రతినిధి తెలిపారు.
2019లో డెమోక్రటిక్ ప్రైమరీ ఎంపిక సమయంలో హారిస్‌తో డిబేట్ చేస్తున్నప్పుడు తులసి ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. హారీస్ విధానాలకు వ్యతిరేకంగా తులసి గబ్బార్డ్ తీవ్రంగా దాడి చేశారు. ఇదే కారణంతో గబ్బర్డ్‌ని ఎంపిక చేశారనే చర్చ కూడా సాగుతోంది. ఇక.. 2020 అధ్యక్ష ఎన్నికల తర్వాత తులసి డెమోక్రటిక్ పార్టీ నుంచి వైదొలిగారు. అప్పటి నుంచి ట్రంప్ మద్దతుతో సెలబ్రిటీగా కొనసాగుతున్నారు. గత కొన్ని ఏళ్లుగా ట్రంప్‌తో తులసి స్నేహంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment