వరుస పేలుళ్లతో వణికిన బాగ్దాద్‌ | Twin suicide bombings kill at least 32 in Baghdad | Sakshi
Sakshi News home page

వరుస పేలుళ్లతో వణికిన బాగ్దాద్‌

Published Fri, Jan 22 2021 2:29 AM | Last Updated on Fri, Jan 22 2021 2:29 AM

Twin suicide bombings kill at least 32 in Baghdad - Sakshi

బాగ్దాద్‌: రెండు ఆత్మాహుతి బాంబు దాడులతో గురువారం ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ వణికి పోయింది. సెంట్రల్‌ బాగ్దాద్‌లోని నిత్యం రద్దీగా ఉండే ‘బాబ్‌ అల్‌ షార్కి’లో జరిగిన ఈ రెండు వరుస పేలుళ్లలో కనీసం 32 మంది ప్రాణాలు కోల్పోయారు. 110 మందికి పైగా గాయాల పాలయ్యారు. చెల్లాచెదురుగా పడిన మృతులు, క్షతగాత్రుల దేహాలతో ఘటనాస్థలి హృదయవిదారకంగా మారింది. ఈ పేలుళ్లకు ఇంతవరకు ఏ సంస్థ కూడా బాధ్యత తీసుకోలేదు. కానీ, అధికారులు మాత్రం ఇది ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్ర సంస్థ పనేనని ధ్రువీకరించారు.

ఆర్థిక సంక్షోభంతో పాటు ముందస్తు ఎన్నికలు జరగనున్నాయన్న వార్తలతో రాజకీయంగా దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మాహుతికి సిద్ధమైన వ్యక్తి మొదట, మార్కెట్‌ మధ్య నిల్చుని తనకు ఆరోగ్యం బాలేదంటూ గట్టిగా అరిచాడని, దాంతో అందరూ ఆయన చుట్టూ మూగారని, అదే సమయంలో ఆ ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడని జాయింట్‌ ఆపరేషన్స్‌ కమాండ్‌ మేజర్‌ జనరల్‌ తహసిన్‌ అల్‌ ఖఫాజీ వివరించారు. ఆ తరువాత కాసేపటికే మరో వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని తెలిపారు. ఇస్లామిక్‌ స్టేట్‌ స్లీపర్‌ సెల్‌ చేసిన దారుణమిదని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement