ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై మరో రెండు హత్య కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమెపై నమోదైన మొత్తం కేసుల సంఖ్య 94కి చేరుకుంది. హసీనా గత నెలలో ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు చేరుకున్నారు. ఆమెపై నమోదైన 94 కేసులలో చాలా వరకు వివాదాస్పద రిజర్వేషన్ కోటా వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా జరిగిన హత్యలకు సంబంధించినవే అయివున్నాయి.
జూలై 19న జరిగిన నిరసనల సందర్భంగా ఢాకా నివాసి ఒకరు హతమయ్యారు. దీనికి సంబంధించిన కేసులో హసీనాతో పాటు మరో 26 మందిపై హత్య కేసు నమోదయ్యిందని డైలీ స్టార్ వార్తాపత్రిక తెలిపింది. మృతుడి భార్య ఢాకా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అఫ్నాన్ సుమీ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్, అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ ఒబైదుల్ క్వాడర్, అవామీ లీగ్‌తో పాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నిందితులుగా ఉన్నారు. జూలై 19న బంగ్లాదేశ్ టెలివిజన్ భవన్ ముందు తన భర్తను కాల్చి చంపారని మృతుడి భార్య తన ఫిర్యాదులో పేర్కొంది.
ఇదేవిధంగా జత్రాబరి ప్రాంతంలో ఒక విద్యార్థి మృతికి సంబంధించి హసీనా, మాజీ న్యాయశాఖ మంత్రి షఫీక్ అహ్మద్, మాజీ అటార్నీ జనరల్ ఏఎం అమీన్ ఉద్దీన్, సుప్రీంకోర్టు న్యాయవాది తానియా అమీర్‌తో పాటు మరో 293 మందిపై కేసు నమోదైంది. మృతుని తల్లి జాత్రబరి పోలీస్ స్టేషన్‌లో ఈ ఉదంతంపై ఫిర్యాదు చేశారు. తన కుమారుడు ఆగస్టు 5న రిజర్వేషన్ల సంస్కరణ ఉద్యమంలో పాల్గొన్నాడని, ఉదయం 9 గంటల ప్రాంతంలో జత్రాబరి పోలీస్ స్టేషన్ దాటుతుండగా అతనిపై కాల్పులు జరిపారని ఫిర్యాదుదారు ఆరోపించారు. బాధితుడిని ఢాకా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment