టోక్కో: ఈ కాలంలో 60,70 ఏళ్లు బతికితే చాలు అనుకునే వారు చాలామంది ఉన్నారు. ఒకవేళ 90 ఏళ్లు బతికితే ఇక జీవితానికి అదే మహాభాగ్యం. కానీ జపాన్‌కు చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు సెంచరీ దాటేసి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. వృద్ధ కవలల విభాగంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు. వారే ఉమెనో సుమియామా, కోమే కొడామా. ప్రస్తుతం వీరి వయస్సు 107 ఏళ్ల 320 రోజులు. జీవిస్తున్న వారిలో ప్రపంచంలోనే అత్యంత వృద్ధ కవలలుగా(మహిళలు) ఈ ఘనత సాధించినట్లు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ అధికారులు వెల్లడించారు.
ఇంతకు ముందు కూడా ఈ రికార్డు జపాన్ కవలల పేరిటే ఉంది. అయితే వారి వయసు 107 సంవత్సరాల 175 రోజులే కావడంతో ఇప్పుడు ఆ రికార్డు ఉమెనో సుమియామా, కోమే కొడామాలకు దక్కింది. వీరు 1913 వవంబర్ 5న వీరు జన్మించారు. తమ కుటుంబంలో మొత్తం 11 మంది పిల్లలు జన్మించగా.. తమ తల్లికి మూడో కాన్పులో ఈ కవలలు జన్మించారు. జంటగా పుట్టినా వీరిద్దరు ఒకేచోట పెరగలేదు. స్కూల్ చదివేరోజుల్లో కౌమే పనిచేయడానికి వేరే ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో పుట్టిన ప్రాంతాన్ని వదిలి కుటుంబానికి దూరంగా పెరిగారు. అలాగే వివాహం కూడా ఉమెనో షాడో ద్వీపానికి చెందిన వ్యక్తినే వివాహం చేసుకుని అక్కడే ఉండిపోగా కౌమే మాత్రం తల్లిదండ్రులతో ఉంటూ అక్కడి ప్రాంతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నారు.
ఈ కవల అక్కచెల్లెళ్లు ఇద్దరు రెండు ప్రపంచ యుద్ధాల్ని చూశారు. ఇద్దరు 300 కి.మీ దూరంలో ఉండేవారు. దీంతో వారు కలుసుకోవటం కూడా చాలా తక్కువగా జరిగేది. బంధువుల పెళ్లిళ్లు, అంత్యక్రియల సమయాల్లో మాత్రమే కలుసుకునేవారు. ఒకరినొకరు చూసుకునేవారు. కానీ వారికి 70 సంవత్సరాల వయస్సు వచ్చాక ఇద్దరు కలిసి సమయం గడపాలని అనుకున్నారు. అలా వారిద్దరు బౌద్ధ తీర్థయాత్రల కలిసి ప్రయాణించారు. ఇక 125 మిలియన్ల జనాభా కలిగిన జపాన్‌లో 29శాతం మంది 65 సంవత్సరాలు పైబడిన వారే ఉన్నారు. ఇందులో 86,510 మంది వందేళ్లు పూర్తి చేసుకున్నవారే.
Comments
Please login to add a commentAdd a comment