అంతెత్తున పేరుకున్న చెత్త, అయినా వెడ్డింగ్‌ రింగ్‌ కోసం.. | UK Man Loses Wedding Ring In Garbage Vehicle After Staff Find Him | Sakshi
Sakshi News home page

అంతెత్తున పేరుకున్న చెత్త, అయినా వెడ్డింగ్‌ రింగ్‌ కోసం..

Published Mon, Feb 22 2021 12:34 PM | Last Updated on Mon, Feb 22 2021 2:44 PM

UK Man Loses Wedding Ring In Garbage Vehicle After Staff Find Him - Sakshi

లండన్‌: వివాహ బంధంలో వెడ్డింగ్‌ రింగ్‌కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అవి భార్యభర్తల మధ్య ప్రేమకు ప్రాతినిథ్యం వహిస్తాయి. అయితే ఓ వ్యక్తి సరిగ్గా ప్రేమికుల రోజునే తన వెడ్డింగ్‌ రింగ్‌ పొగొట్టుకున్నాడు. భార్యకు ఏం చెప్పాలో.. రింగ్‌ ఎక్కడ పోయిందోనని తెగ గాబరాపడ్డాడు. చివరకు మున్సిపల్‌ సిబ్బంది చొరవడంతో ఉంగరాన్ని వెతికి పట్టుకుని ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సంఘటన బ్రిటన్‌లో జరిగింది. వివరాలు.. బ్రిటన్‌కు చెందిన జేమ్స్‌ రాస్‌కు 2009లో లారాతో వివాహామైంది. ప్రస్తుతం వీరికి ఇద్దరు కూతుళ్లు. పెళ్లై ఇన్నేళ్లవుతున్న రాస్‌ ఈ తన పెళ్లి ఉంగరాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఎప్పుడూ దానిని చేతి వేలికి ధరించే ఉంటాడట.

ఈ క్రమంలో ప్రేమికుల రోజున ఉదయాన్నే మున్సిపాలిటీ వాహనం రాగానే ఇంట్లోని చెత్తను అందులో పడేశాడు. తిరిగి ఇంట్లోకి వెళ్లి తన పనుల్లో మునిగిపోయాడు. అయితే, కాసేపయ్యాకు చూసుకుంటే వేలికి ఉండే ఉంగరం మాయమైంది. అది చూసి రాస్‌ షాకయ్యాడు. ఏమైందో తెలియక తెగ కంగారు పడ్డాడు.  తను ఏమేం పనులు చేశాడో గుర్తు చేసుకున్నాడు. చెత్త వేసి వచ్చాకే ఉంగరం మిస్సయిందన్న విషయం తెలుసుకుని వెంటనే పరుగెత్తుకెళ్లాడు. అయితే అప్పటికే మున్సిపాలిటీ వాహనం ఆ కాలనీ నుంచి వెళ్లిపోయింది. దీంతో అక్కడే ఉన్న మహిళా పోలీసు అధికారినికి తన గోడు చెప్పుకున్నాడు. ఆమె స్పందించి ఆ వాహనాన్ని వెంబడించింది. మున్సిపాలిటీ సిబ్బందికి జరిగిన విషయం చెప్పి ఉంగరం వెతకమని నలుగురు మున్సిపాలిటీ సిబ్బందిని కోరింది. దీంతో వారు వాహనంలో ఉంగరం వెతకడం ప్రారంభించారు.

అంతెత్తున పేరుకున్న చెత్తలో దాదాపు 20 నిమిషాలు వెతికి ఉంగరాన్ని కనిపెట్టి రాస్‌కు ఇచ్చారు. దీంతో అతడు ప్రాణం లేచివచ్చినంతగా ఆనందపడ్డాడు. మళ్లీ తన ఉంగరం దొరుకుతుందని అనుకోలేదంటూ హర్షం వ్యక్తం చేశాడు. ఇక ఈ విషయాన్ని బ్రిటిన్‌ మున్సిపాలిటీ అధికారులు ఫేస్‌బుక్‌లో పోస్టు‌ చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో సదరు సిబ్బందిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే దీనిపై రాస్‌ స్పందిస్తూ.. ‘అసలు రింగ్ దొరుకుతుందని అనుకోలేదు. వాలెంటైన్స్ డే నాడే వెడ్డింగ్‌ రింగ్‌ పోయిందన్న విషయం నా భార్యకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. నా ప్రాణం పోయినంత పనైంది’ అంటూ అతడు పోస్టు చేశాడు. అయితే ఈ ఉంగరం అతడికి ఎందుకంత ప్రత్యేకమో కూడా వివరించాడు. ఆ ఉంగరంపై తన భార్య రాసిన అక్షరాలు ఉన్నాయని, అవి లేజర్ ద్వారా సెట్ చేసినట్లు చెప్పాడు. అందుకే ఈ ఉంగరం తనకు చాలా ప్రత్యేకమని రాస్‌ చెప్పాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement