ఉక్రెయిన్ రాయబారి సెర్గే కైస్లిట్సియా
న్యూయార్క్: యుద్ధంలో పాల్గొన్న ఒక రష్యా సైనికుడు చనిపోవడానికి కొంత సమయం ముందు తన తల్లికి పంపిన సందేశమంటూ ఒక సందేశాన్ని ఉక్రెయిన్ రాయబారి ఐరాసలో వినిపించారు. యుద్ధంలో పాల్గొనడం భయంగా ఉందని, ఇక్కడ ఉక్రెయిన్ పౌరులను లక్ష్యంగా చేసుకొంటున్నారని లేఖలో పేర్కొన్నట్లు ఉక్రెయిన్ రాయబారి సెర్గే కైస్లిట్సియా చెప్పారు. చనిపోయిన ఒక రష్యా సైనికుడి మొబైల్‌లో ఈ సందేశాలు కనిపించాయని చెబుతూ సదరు సందేశం స్క్రీన్‌షాట్‌ను ఆయన ప్రదర్శించారు.
అనంతరం మెసేజ్‌ను చదివి వినిపించారు. ముందుగా ఎలా ఉన్నావని తల్లి సైనికుడిని అడగడం, ఎందుకు అందుబాటులోకి రావడం లేదని ప్రశ్నించడం, ఇంకా తను శిక్షణలోనే ఉన్నాడా? అని అడగడంతో సందేశం ఆరంభమైంది. తాను క్రిమియాలో లేనని, ఉక్రెయిన్‌లో ఉన్నానని కొడుకు జవాబిచ్చాడు.
ఇక్కడ చాలా భయంగా ఉందని, నగరాలపై తాము బాంబింగ్ చేస్తున్నామని, పౌరులను లక్ష్యంగా చేసుకొని చంపేస్తున్నామని చెప్పుకొచ్చాడు. ఇక్కడ ప్రజలు తమను వ్యతిరేకిస్తున్నారని, తమ వాహనాలను అడ్డుకుంటున్నారని, తమ సాయుధ వాహనాల కింద పడి చనిపోతున్నారని వాపోయాడు. తమని అక్కడి పౌరులు ఫాసిస్టులని పిలుస్తున్నారంటూ బాధ పడ్డాడు. ఈ సందేశాలు పంపుకున్న తర్వాత సదరు సైనికుడు పోరాటంలో మరణించాడని సెర్గే చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment