కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా బలగాల దాడులు తీవ్రతరమయ్యాయి. సామాన్య పౌరులే లక్ష్యంగా రష‍్యన్ దళాలు దాడులు చేస్తున్నాయి. కాగా, దాడుల్లో ఉక్రెయిన్ పోర్టు నగరం మరియుపోల్‌లోని బలగాలు ఆయుధాలు కిందపడేసి.. లొంగిపోవాలన్న రష్యా డిమాండ్‌ను ఉక్రెయిన్ తిరస్కరించింది. లొంగిపోయే ప్రసక్తే లేదని ఘాటుగా స్పందించింది.
అయితే, మరియుపోల్‌లో రష్యా బలగాలు భీకర దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలు కింద పడేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించాయి. ఈ క్రమంలో తమ దేశ బలగాలు లొంగిపోయే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ ఉప ప్రధాని ఇరినా వెరెశ్చక్ స్పష్టం చేశారు. రష్యా హెచ‍్చరికలను వ్యతిరేకిస్తున్నట్టు వెల్లడించారు. అంతకు ముందు రష్యా బలగాలు మరియుపోల్ నగరంలోని ఆర్ట్ స్కూల్‌పై బాంబు దాడులు చేశాయి. ఈ దాడులు జరిగిన సమయంలో ఆ స్కూల్‌లో 400 మంది శరణార్థులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ప్రాణ నష్టం గురించి తెలియాల్సి ఉంది.
మరోవైపు.. దాడుల్లో రష్యాకు మరో షాక్ తగిలింది. బ్లాక్‌సీ ఫ్లీట్‌కు చెందిన సీనియర్ నౌకాదళ కమాండర్ ఆండ్రీ పాలీ.. మరియుపోల్‌లో ఉక్రెయిన్‌తో జరిగిన దాడుల్లో మృతి చెందారు. ఈ విషయాన్ని సేవస్టోపోల్ పోర్ట్ సిటీ గవర్నర్ మైఖేల్ రాజోజయేవ్ తెలిపారు. తాజాగా.. రష్యా బాంబు దాడుల్లో సుమీఖింపోరమ్ కెమికల్ ప్లాంట్ నుంచి అమ్మోనియా లీక్ అయింది. ప్లాంటుకు దాదాపు 5 కిలోమీటర్ల మేర అమ్మోనియా ప్రభావం ఉంటుందని సుమీ గవర్నర్ ఓబ్లాస్ట్ మిత్రో పేర్కొన్నారు. దీంతో కెమికల్ ప్లాంట్ సమీపంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మాస్కులు ధరించి శ్వాస తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment