టర్కీలో రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధుల శాంతి చర్చలు జరుగుతాయనే ప్రచారం నడుమ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ ఆసక్తికర ప్రకటనకు తెర లేపాడు. యుద్ధ సంక్షోభానికి ముగింపు పలికే దిశగా ఆయన ప్రకటన ఉండడం విశేషం.
ఆదివారం రాత్రి నేరుగా రష్యా జర్నలిస్టులను ఉద్దేశించి వీడియో కాల్‌లో మాట్లాడిన జెలెన్‌స్కీ.. తటస్థ వైఖరిని అవలంభించేందుకు ఉక్రెయిన్ సిద్ధమంటూ సంచలన ప్రకటన చేశాడు. మూడో పార్టీ సమక్షంలో తప్పనిసరి ఒప్పందం, రెఫరెండానికి సైతం సిద్ధమంటూ పేర్కొన్నాడు జెలెన్‌స్కీ. శాంతి ఒప్పందంలో భాగంగా.. తూర్పు డోనాబాస్ ప్రాంతం విషయంలో తటస్థంగా ఉండడంతో పాటు వెనక్కి తగ్గేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని ఆదివారం రష్యా జర్నలిస్టుల సమక్షంలో ప్రకటించాడు జెలెన్‌స్కీ.
‘‘ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు, తటస్థత, అణు రహిత స్థితి.. ఈ అంశాలపై శాంతి చర్చలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం’’ అంటూ రష్యన్ భాషలోనే జెలెన్‌స్కీ ప్రసంగించడం విశేషం. జెలెన్‌స్కీ ప్రసంగాలు, ఉక్రెయిన్ పరిణామాలపై కథనాలు ప్రసారం చేయకూడదని రష్యా జర్నలిస్టులకు రష్యా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయినప్పటికీ శాంతి కోరే దిశగా కీలక ప్రకటన కావడంతో వాళ్లు ఆ కథనం టెలికాస్ట్ చేయడం గమనార్హం!. అయితే..
ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేసిన వేళ.. ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధిపతి కైర్‌య్లో బుడానోవ్ మాత్రం విరుద్ధమైన ప్రకటన చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ తూర్పు భాగాన్ని ఆక్రమించే లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నాడంటూ బుడానోవ్ వ్యాఖ్యానించారు. ‘‘కొరియాను విడగొట్టినట్లే.. ఉక్రెయిన్‌ను విడగొట్టాలనే దురాలోచనలు ఉన్నాయి కొందరికి. ఇది ఆపడానికి ఇప్పటికే మా దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. పాశ్చాత్యదేశాలను యుద్ధట్యాంకులు, విమానాలు, మిస్సైల్స్ పంపాలని కోరారు’’ అంటూ ఆదివారం ఒక విరుద్ధ ప్రకటన విడుదల చేశారు.
మరోవైపు ఆదివారం.. పుతిన్, టర్కీ అధ్యక్షుడు టాయిప్ ఎర్డోగాన్ మధ్య చర్చలు జరిగాయి. రష్యా-ఉక్రెయిన్ నడుమ కాల్పుల విరమణ, పౌరుల సురక్షిత తరలింపు అంశాలు ఎజెండాగా ఇస్తాంబుల్ మధ్యవర్తిత్వం వహించేందుకు టాయిప్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే ఎప్పుడైనా.. రష్యా-ఉక్రెయిన్ అధికారుల మధ్య చర్చలు జరగనున్నాయి.
ఇదిలా ఉండగా.. శనివారం పోల్యాండ్ పర్యటన సందర్భంగా పుతిన్ ఇక అధికారంలో ఉండడంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వ్యాఖ్యలపై అమెరికా భద్రతా ప్రతినిధి ఆంటోనీ బ్లింకెన్ ఆదివారం ఒక స్పష్టత ఇచ్చారు. ‘‘పుతిన్‌ను గద్దె దించడమా? రష్యా సార్వభౌమ అధికారంలో తలదూర్చడం మాకేం పని? ప్రభుత్వ విషయంలో జోక్యం చేసుకునే ఉద్దేశం అమెరికా లేదు’’ అని పేర్కొన్నారు బ్లింకెన్.
Comments
Please login to add a commentAdd a comment