
లండన్ : పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు బ్రిటన్ షాక్ ఇచ్చింది. వీసా పొడిగింపు కోసం ఆయన చేసుకున్న దరఖాస్తును యూకే హోం ఆఫీస్ తిరస్కరించింది. అవినీతి కేసుల్లో శిక్ష పడ్డ షరీఫ్ నిబంధనలకు విరుద్ధంగా దేశంలో ఉంటున్నారని, నవాజ్ షరీఫ్ బ్రిటన్ విడిచి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. కాగా, 71 ఏళ్ల నవాజ్ షరీఫ్.. పాకిస్తాన్‌లో రెండు అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. అల్ అజీజియా మిల్స్ కేసులో 2018లో ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. లాహోర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నవాజ్ వైద్య చికిత్స కోసం లాహోర్ కోర్టు నాలుగు వారాల బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన చికిత్స కోసం 2019లో ఇంగ్లాండ్‌కు వచ్చారు.
ఇక అప్పటినుంచి లండన్‌లోనే ఉంటున్నారు. అయితే, ఇతర దేశాల వారు ఆరు నెలల కంటే ఎక్కువ సమయం బ్రిటన్‌లో ఉండటానికి వీలు లేదు. వీసా గడువును వంతుల వారీగా పెంచుకుంటూ ఆయన అక్కడే ఉంటున్నట్లు తెలుస్తోంది. వీసా గడుపు పొడిగింపు తిరస్కరణపై షరీఫ్ తరపు అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. లండన్‌లో ఆయన చికిత్సను కొనసాగించటానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తామన్నారు. బ్రిటీష్ ఇమిగ్రేషన్ ట్రిబ్యునల్‌లో అప్పీల్‌కు వెళ్లామని తెలిపారు.