‘వారంలో ఏడు రోజులు ఫ్రీగా పని చేస్తాను’ | Indian student in UK offers to work for free to secure visa job | Sakshi
Sakshi News home page

‘వారంలో ఏడు రోజులు ఫ్రీగా పని చేస్తాను’.. యూకేలో యువతి ఆవేదన

Published Thu, Nov 7 2024 1:34 PM | Last Updated on Thu, Nov 7 2024 1:45 PM

Indian student in UK offers to work for free to secure visa job

యూకేలో ఉండడానికి ఉచితంగా పని చేయాడానికైనా సిద్ధంగా ఉన్నట్లు ఓ భారతీయ విద్యార్థిని తెలిపింది. గ్రాడ్యుయేషన్‌ చేసేందుకు యూకే వెళ్లిన ఆమె అక్కడే ఉండేందుకు ఉచితంగా పని చేస్తానని లింక్డ్‌ఇన్‌ పోస్ట్‌లో తెలియజేశారు. 2022లో గ్రాడ్యుయేషన్‌ పూర్తయినప్పటి నుంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లు శ్వేత చెప్పారు. తాను రోజు 12 గంటలపాటు వారంలో ఏడు రోజులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈపోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

‘నా పేరు శ్వేత. నేను గ్రాడ్యుయేషన్‌ చేసేందుకు యూకే వచ్చాను. నా గ్రాడ్యుయేట్ వీసా మూడు నెలల్లో ముగియనుంది. నేను యూకేలో వీసా అందించే కంపెనీల్లో ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. 2022లో నా గ్రాడ్యుయేషన్‌ పూర్తయినప్పటి నుంచి 300 కంటే ఎక్కువగానే ఉద్యోగాలకు దరఖాస్తు చేశాను. యూనివర్శిటీ ఆఫ్ లీసెస్టర్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్సీ పట్టా పొందాను. వీసా స్పాన్సర్డ్ డిజైన్ ఇంజినీర్ ఉద్యోగాల కోసం చూస్తున్నాను. మీరు యూకేలో కంపెనీ నిర్వహిస్తూ డిజైన్ ఇంజినీర్ల కోసం వెతుకుతున్నట్లయితే నన్ను వెంటనే ఉద్యోగంలోకి తీసుకోండి. వారంలో ఏడు రోజులపాటు రోజువారీ 12 గంటలు పని చేస్తాను. ఒక నెలపాటు నాకు ఎలాంటి జీతం అవసరం లేదు. నా పనితీరు గమనించండి. నచ్చితే కొనసాగించండి. లేదంటే ఎలాంటి వివరణ ఇవ్వకుండా వెంటనే ఉద్యోగం నుంచి తొలగించండి. ఈ పోస్ట్‌ను అంతర్జాతీయ విద్యార్థులు చదువుతుంటే దీన్ని రీపోస్ట్ చేయండి’ అని తెలుపుతూ దానికి సంబంధించిన ఇమేజ్‌ను కూడా శ్వేత షేర్‌ చేశారు.

ఇదీ చదవండి: ‘నవంబర్‌ 8న సెలవులో ఉంటాను.. బై’!

మిమ్మల్ని మీరు నమ్మండి

ఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘మీరు వెళ్లిన దేశంలో ఉండటానికి ఉచితంగా పని చేయడం లేదా అన్నేసి గంటలు పనిచేయడం అసంబద్ధం. మీకు ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను’ అంటూ ఒకరు కామెంట్‌ చేశారు. ‘యూకేలో ఉండడం కోసం ఇలా చేయనవసరం లేదు. మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు తెలివైనవారు. ప్రపంచంలో ఎక్కడైనా గుర్తింపు పొందుతారు’ అని మరొకరు రిప్లై ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement