
అఫ్గనిస్థాన్‌లో అధికారంలోకి వచ్చాక తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న తాలిబన్ ప్రభుత్వానికి శుభవార్త అందించింది ఐక్యరాజ్య సమితి. అఫ్గనిస్థాన్ ప్రభుత్వానికి అంతర్జాతీయ సమాజంలో గుర్తింపు దక్కేలా ఒక అడుగు ముందుకు వేసింది.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో గురువారం ఒక తీర్మానం చేయగా.. ఆమోదం లభించింది. అఫ్గనిస్థాన్ ప్రభుత్వంతో సంబంధాలు కొనసాగించేందుకు ప్రవేశపెట్టిన తీర్మానం అది. ఇక వోటింగ్‌కు రష్యా దూరం కాగా.. 14 ఓట్లు అనుకూలంగా వచ్చాయి. దీంతో ఈ తీర్మానం తర్వాతి దశకు వెళ్తుంది. ప్రపంచంలోని ఎక్కువ దేశాలు గనుక ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తే(తప్పనిసరేం కాదు!).. ఆపై తాలిబన్లు నడిపిస్తున్న అఫ్గనిస్థాన్ ప్రభుత్వానికి అంతర్జాతీయ సమాజంలో గుర్తింపు దక్కినట్లు అవుతుంది.
తాలిబన్ లేకుండానే..
అయితే ఐరాసలో భద్రతా మండలి ప్రవేశపెట్టిన తీర్మానంలో చిన్నమెలిక ఉంది. ఎక్కడా తాలిబన్ అనే పదాన్ని పేర్కొనలేదు. కాకపోతే.. యూఎన్ పొలిటికల్ మిషన్ ఏడాది పాటు ఉంటుందని, అఫ్గనిస్థాన్‌లో శాంతి స్థాపనకు కృషి చేస్తుందని మాటిచ్చింది. అయితే తాలిబన్ అనే పదం లేకపోవడం సాంకేతికంగా అఫ్గన్ సాయానికి, గుర్తింపునకు ఎలాంటి ఆటంకంగా మారబోదు. కాకపోతే.. తాలిబన్ అనే పదం బదులు.. మరో పదం తీసుకురావాలని ప్రపంచ దేశాలు ఒత్తిడి చేసే అవకాశాలు మాత్రం ఉన్నాయి.
ఇక ఈ తీర్మానంలో.. పరస్సర సహకారం, మానవతా కోణంలో సాయం, రాజకీయ అంశాలపై హామీలు ఉన్నాయి. ఉనామా(UNAMA ..the UN mission to Afghanistan)కు ప్రపంచ దేశాలు అన్ని విధాల సహకరిస్తాయని ఆశిస్తున్నట్లు తీర్మానం ప్రవేశపెట్టిన నార్వే ఐరాస రాయబారి మోనా జుల్ చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment