![United States Expelled 12 Russian Diplomats From The UN - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/2/Diplomats.jpg.webp?itok=NUkEDT1c)
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో రష్యాకు చెందిన 12 మంది దౌత్యాధికారులను అమెరికా బహిష్కరించింది. వీరంతా గూఢచర్య కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారని ఆరోపించింది. అమెరికాది రెచ్చగొట్టే చర్యన్న రష్యా, ఐరాసకు కేంద్రకార్యాలయం ఉన్న దేశంగా అమెరికా ఈ విధంగా చేయడం ఐరాస నిబద్ధతకు వ్యతిరేకమని విమర్శించింది. ఐరాసలో రష్యా శాశ్వత రాయబార బృందానికి, ఐరాస కేంద్ర కార్యాలయానికి బహిష్కరణ విషయాన్ని తెలియజేశామని ఐరాసలో అమెరికా రాయబారి ప్రతినిధి ఓలివియా డాల్టన్ తెలిపారు.
దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని వీరిపై చర్య తీసుకున్నామని, ఐరాస కేంద్రకార్యాలయ ఒప్పంద నిబంధనలకు అనుగుణంగానే వారిని బహిష్కరించామని వివరించారు. అమెరికా చర్య నిబంధనలకు వ్యతిరేకమని రష్యా రాయబారి వాస్లీ నెబెంజియా విమర్శించారు. అమెరికా చర్యకు తప్పక ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు. అనంతరం ఈ విషయాన్ని ఆయన భద్రతామండలి సమావేశంలో ప్రస్తావించారు. అయితే ఎజెండాలో రాయబారుల బహిష్కరణ అంశం లేదని నెబెంజియాను యూఎస్ ప్రతినిధి అడ్డుకున్నారు. ఉక్రెయిన్‌లో మానవీయ సంక్షోభాన్ని చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటైందన్నారు.
(చదవండి: మెళ్లకు మైళ్లు నడిచి..)
Comments
Please login to add a commentAdd a comment