వాషింగ్టన్: రష్యా చర్యకు అమెరికా ప్రతిచర్యకు దిగింది. తమ దేశం నుంచి ఇద్దరు రష్యా దౌత్యవేత్తను బహిష్కరిస్తూ తాజాగా ప్రకటన చేసింది. కీలక సమాచారం సేకరించారనే ఆరోపణలపై ఇద్దరు అమెరికన్ దౌత్యవేత్తలను తమ దేశం విడిచి వెళ్లాలంటూ కిందటి నెలలో రష్యా ఆదేశించింది. ఈ యాక్షన్‌కు కౌంటర్ యాక్షన్‌గానే.. అగ్రరాజ్యం ఇప్పుడు కౌంటర్ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.
‘‘మా దౌత్యవేత్తలను రష్యా ప్రభుత్వం కావాలనే వేధింపులకు గురి చేస్తోంది. ఈ పరిణామాన్ని మేం సహించేది లేదు’’ అని అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తాజాగా ఒక ప్రకటనలో తెలిపారు. తద్వారా ఇది ప్రతీకారచర్య అనే విషయాన్ని స్పష్టం చేశారాయన. అమెరికాను విడిచి వెళ్లేందుకు రష్యా దౌత్య వేత్తలిద్దరికీ వారం గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే వాళ్ల పేర్లు మాత్రం వెల్లడించలేదు.
ఇదిలా ఉంటే.. వ్లాడివోస్టోక్‌లోని అమెరికా కాన్సులేట్‌కు చెందిన ఓ మాజీ ఉద్యోగి.. రష్యా భద్రతకు సంబంధించిన కీలక సమాచారం సేకరించాడని దర్యాప్తులో తేలింది. దీంతో అతన్ని దోషిగా తేల్చారు. అయితే.. అమెరికా దౌత్యవేత్తలు జెఫ్రీ సిల్లిన్, డేవిడ్ బెర్న్‌స్టెయిన్‌లు ఆ మాజీ ఉద్యోగితో సంబంధాలు కలిగి ఉన్నారని, వాళ్లు కూడా ఇందుకు సహకరించారని ఆరోపిస్తూ రష్యా ఈ ఇద్దరిని బహిష్కరించింది.
అయితే అమెరికా ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. తమ దౌత్యవేత్తలను రష్యా ఘోరంగా అవమానిస్తోందని విమర్శించింది. మరోవైపు 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా-అమెరికాల మధ్య సంబంధాలు అంతకంతకు దిగజారుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment