వాషింగ్టన్ : కరోనావైరస్‌కు సురక్షితమైన వ్యాక్సిన్ ఈ ఏడాది చివరినాటికి లేదా 2021 ప్రారంభంలో అందుబాటులోకి వస్తుందని అమెరికా ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌసీ అభిప్రాయపడ్డారు. టీకా ఆవిష్కరణ ప్రక్రియ వచ్చే ఏడాదిలోపే పూర్తి చేయాలని, అంతకంటే ఎక్కువ సమయం తీసుకోకూడదని అన్నారు. శనివారం ఆయన అమెరికన్ న్యూస్ బ్రాడ్‌కాస్టర్ పీబీఎస్‌తో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ప్రథమంలో వ్యాక్సిన్‌ను కచ్చితంగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. లేదంటే మరింత నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. పూర్తి స్థాయిలో కాకున్నా సగం ప్రభావితం చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. ఏడాదిలోపు ప్రపంచాన్ని సాధారణ స్థితికి తీసుకురావచ్చని అభిప్రాయపడ్డారు.
(చదవండి : ఆశలన్నీ ఆక్స్‌ఫర్డ్ టీకాపైనే..)
నవంబర్ 3 నాటికి వ్యాక్సిన్ సిద్ధంగా ఉండవచ్చని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినప్పటికీ, షాట్లు సాధారణ ప్రజలకు చేరడానికి 2021 వరకు పట్టవచ్చని ఫౌసీ అభిప్రాయపడ్డారు.ఇక రష్యా అందుబాటులోకి తెచ్చిన వ్యాక్సిన్ గురించి మాట్లాడుతూ.. ఒక వ్యాక్సిన్ రాగానే దానిని ప్రజలకు అందించాలని కాదు, అది సురక్షితమైనదో కాదో, ప్రభావవంతంగా పని చేస్తుందో లేదో చూడాలని చెప్పారు. (చదవండి : దేశంలో 50వేలకు చేరువలో మరణాలు)
కాగా, కరోనా వైరస్ వ్యాక్సిన్ ను రష్యా ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. విడుదల చేసిన తొలి వ్యాక్సిన్ ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కుమార్తెకు వేయించారు. కానీ ఈ వ్యాక్సిన్ ను వ్యాధిగ్రస్తులకు వేయించేందుకు భారత్ తో పాటు ప్రపంచ దేశాలు అంగీకరించడం లేదు.అంతేకాదు పలు దేశాలకు చెందిన సైంటిస్ట్ లు రష్యా విడుదల చేసిన వ్యాక్సిన్ స్పుత్నిక్ టీకా వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని విమర్శించారు.అయితే, టీకా గురించి ఆందోళనలను రష్యా కొట్టిపారేసింది, దీనిని పాశ్చాత్య అసూయగా అభివర్ణించింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దాని సమర్థతకు హామీ ఇచ్చారు. అక్టోబర్‌లోనే సామూహిక టీకాలు వేయాలని రష్యా యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment