బీజింగ్: తైవాన్‌పై చైనా దురాక్రమణకు సిద్ధమైతే తాము చూస్తూ ఊరుకోబోమని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది. తైవాన్‌కు అండగా ఉంటూ రక్షిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. సీఎన్‌ఎన్ వార్తా సంస్థ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్ అమెరికా ఎలాంటి యుద్ధాన్ని కోరుకోవడం లేదని చెప్పారు. కానీ, డ్రాగన్ దేశం తప్పులు చేస్తూ ఆ దిశగా తమని ప్రేరేపిస్తోందని ఆరోపించారు.
తైవాన్‌ను కాపాడే విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చైనాకు అర్థం కావడానికే ఈ విషయం చెబుతున్నానని, తమ బలమేంటో అందరికీ తెలుసని అన్నారు. తైవాన్‌ను తమ దేశంలో కలిపేసుకోవడానికి చైనా ఇటీవల కపట వ్యూహాలు పన్నుతోంది. తైవాన్ గగన తలం మీదుగా యుద్ధ విమానాలతో విన్యాసాలు చేస్తూ కయ్యానికి కాలు దువ్వుతోంది. సరిహద్దుల వెంబడి సైనిక కవాతు నిర్వహిస్తోంది. కాగా, బైడెన్ వ్యాఖ్యల్ని చైనా తిప్పి కొట్టింది. తైవాన్ అంశంలో తాము ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదంది. తైవాన్ తమ భూభాగం కిందకే వస్తుందని పునరుద్ఘాటించింది. సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, ప్రయోజనాలపై రాజీ పడబోమని తేల్చి చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment