కుడివైపు తిరగబట్టే బతికిపోయా
కాపాడింది దేవుడో, అదృష్టమో!
ప్రాణాంతక దాడిపై ట్రంప్
మిల్వాయుకీ (డెలావెర్): ప్రాణాంతకమైన దాడికి గురైన క్షణాలను అమెరికా మాజీ అధ్యక్షుడు గుర్తు చేసుకున్నారు. ‘‘ఆ సమయంలో నేను చనిపోయాననే అనుకున్నా. కేవలం అదృష్టమో, దైవమో నన్ను కాపాడాయి’’ అని చెప్పుకొచ్చారు. పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా 20 ఏళ్ల దుండగుడు ఆయనపై కాల్పులకు తెగబడటం తెలిసిందే.
78 ఏళ్ల ట్రంప్ కుడి చెవికి తూటా గాయంతో త్రుటిలో బయటపడ్డారు. తనను రిపబ్లికన్ అధ్యక్ష అభ్యరి్థగా అధికారికంగా ప్రకటించే మూడు రోజుల పార్టీ జాతీయ సదస్సుకు వెళ్తూ ఆయన న్యూయార్క్ పోస్ట్ వార్తా సంస్థతో మాట్లాడారు. సరిగ్గా కాల్పులు జరిగిన సమయంలోనే కుడివైపుకు తల తిప్పడం వల్లే బతికి బయటపడ్డానన్నారు. దీన్ని నమ్మశక్యం కాని అనుభవంగా అభివరి్ణంచారు.
‘‘గాయం తర్వాత పిడికిలి పైకెత్తి ఫైట్ అంటూ నేను నినదిస్తున్న ఫొటోను అంతా ఐకానిక్ ఫొటోగా అంటున్నారు. అలాంటి ఫొటో కావాలంటే మామూలుగానైతే చనిపోవాల్సిందే’’ అంటూ సరదా వ్యాఖ్యలు చేశారు. కాల్పుల తర్వాత కూడా ప్రసంగం కొనసాగించాలనే అనుకున్నట్టు వెల్లడించారు. అధ్యక్షుడు బైడెన్ తనకు ఫోన్ చేసి క్షేమం కనుక్కున్న తీరును అభినందించారు. ఈ సందర్భంగా ట్రంప్ కుడి చెవికి బ్యాండేజీ ధరించి కని్పంచారు.
రిపబ్లికన్ సదస్సుకు భారీ భద్రత
రిపబ్లికన్ల మూడు రోజుల జాతీయ సదస్సు మిల్వాయుకీలో సోమవారం మొదలైంది. ట్రంప్‌పై దాడి నేపథ్యంలో సదస్సుకు కనీవినీ ఎరగని స్థాయిలో వేలాది మంది సిబ్బందితో అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలి్పంచారు.
పోలీసును బెదిరించాడు!
ట్రంప్‌పై దాడికి దిగిన క్రూక్స్ కదలికల్ని కాల్పులకు ముందే ఓ పోలీసు అధికారి పసిగట్టాడు. క్రూక్స్ నక్కిన గోడౌన్‌పైకి ఎక్కి అతన్ని సమీపించబోగా తుపాకీతో బెదిరించాడు. దాంతో ఆ పోలీసు కిందికి దిగేశాడు. అదే సమయంలో ట్రంప్‌పై క్రూక్స్ తూటాల వర్షం కురిపించాడు.
స్కూలు రోజుల నుంచీ ముభావే
క్రూక్స్ స్కూలు రోజుల నుంచీ ఒంటరిగా, ముభావంగానే ఉండేవాడని తోటి విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. ‘‘క్రూక్స్‌కు పెద్దగా మిత్రులు కూడా లేరు. తోటి విద్యార్థులంతా అతన్ని బాగా ఏడిపించేవారు. రైఫిల్ గురి పెట్టడం చేతగాక స్కూల్ షూటింగ్ టీమ్‌లోకి ఎంపిక కాలేకపోయాడు’’ అన్నారు.
జగన్నాథుడే కాపాడాడు: ఇస్కాన్
ప్రాణాంతక దాడి నుంచి ట్రంప్‌ను పురీ జగన్నాథుడే కాపాడాడని ఇస్కాన్ పేర్కొంది. 48 ఏళ్ల కింద న్యూయార్క్‌లో తొలి జగన్నాథ రథయాత్ర విజయవంతం కావడంలో ఆయన ఎంతో సాయపడ్డారని చెప్పింది.
పోలీసుల తప్పిదమే: ఎఫ్‌బీఐ
ట్రంప్‌పై దాడి ఉదంతంపై దర్యాప్తు ముమ్మరమైంది. దీనిపై ఉన్నత స్థాయి స్వతంత్ర విచారణకు బైడెన్ ఆదేశించడం తెలిసిందే. దేశీయ ఉగ్రవాద చర్యగా దీనిపై ఎఫ్‌బీఐ విచారణ చేపట్టింది. దుండగుడు థామస్ మాథ్యూ క్రూక్స్ ఒంటరిగానే ఈ ఘాతుకానికి తెగబడ్డట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచి్చంది. భద్రతా లోపానికి స్థానిక పోలీసు విభాగానిదే బాధ్యత అని సీక్రెట్ సర్వీస్ విభాగం వాదిస్తోంది. క్రూక్స్ మాటు వేసిన గోడౌన్ తమ భద్రతా పరిధికి ఆవల ఉందని పేర్కొంది. కనుక అదంతా స్థానిక పోలీసుల బాధ్యతేనని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment