రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల తన 71వ పుట్టినరోజును జరుపుకున్నారు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసిన ఆయన 21వ శతాబ్దంలో రష్యాను ముందుకు నడిపిస్తున్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన పుతిన్ లా కోర్సు పూర్తిచేసి, సోవియట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కేజీబీలో చిన్న ఉద్యోగంతో కెరియర్ ప్రారంభించి దేశ అధ్యక్షుని హోదాకు చేరుకున్నారు.
పుతిన్ 1952, అక్టోబర్ 7న లెనిన్‌గ్రాడ్ (నేటి సెయింట్ పీటర్స్‌బర్గ్)లో జన్మించారు. పుతిన్ తండ్రి కర్మాగారంలో పనిచేసేవాడు. తల్లి వీధులు ఊడ్చే పని చేసేది. పుతిన్ తన 12 సంవత్సరాల వయస్సులో జూడో నేర్చుకోవడం మొదలుపెట్టాడు. పుతిన్ కళాశాలలో చదువుతున్న సమయంలో సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యునిగా చేరారు. 1991లో ఆ పార్టీ రద్దు అయ్యే వరకు సభ్యునిగా కొనసాగారు.
కళాశాల చదువు తరువాత పుతిన్ సోవియట్ యూనియన్ గూఢచార సంస్థలో చిన్న పోస్ట్‌లో చేరారు. అనంతరం అదే కేజీబీలో లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి చేరుకున్నారు. పుతిన్ 1991లో కేజీబీకి రాజీనామా చేశారు. అప్పుడే అతని రాజకీయ జీవితం ప్రారంభమైంది. మేయర్ కార్యాలయంలో విదేశీ సంబంధాల కమిటీకి ఎన్నికయ్యారు. తరువాత దాని అధిపతి అయ్యారు. 1994, 1996 మధ్యకాలంలో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో అనేక ప్రభుత్వ పదవులను నిర్వహించారు.
1996లో పుతిన్ మాస్కో వెళ్లారు. అక్కడ అప్పటి అధ్యక్షుడు బోరిస్ యెల్ట్సిన్ పరిపాలనలో భాగమ్యారు. యెల్ట్సిన్ రాజీనామాకు ముందు పుతిన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ డైరెక్టర్, రష్యా భద్రతా మండలి కార్యదర్శిగా ఉన్నారు. 1999లో కొంతకాలం మంత్రిగా కూడా పనిచేశారు. యెల్ట్సిన్ రాజీనామా తర్వాత పుతిన్ తాత్కాలిక అధ్యక్షుడయ్యారు. నాలుగు నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లో పుతిన్ అధికారికంగా దేశ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
ఆ తరువాత పుతిన్ ఇక వెనుతిరిగి చూసుకోలేదు. తొలుత 2004 నుంచి 2008 వరకు, ఆ తర్వాత 2012 నుంచి ఇప్పటి వరకు అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. 2008 నుండి 2012 వరకు పుతిన్ నాటి అధ్యక్షుడు దిమిట్రీ మెద్వెదేవ్ దగ్గర ప్రధాన మంత్రిగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: మార్స్ రెడ్ ప్లానెట్ ఎందుకయ్యింది? విలక్షణత ఎలా వచ్చింది?
Comments
Please login to add a commentAdd a comment