ఉక్రెయిన్ నుంచి ఈ స్థాయి ప్రతిఘటన, అమెరికా, పశ్చిమ దేశాల నుంచి ఇంతటి కఠిన ఆంక్షలను పుతిన్ ఊహించలేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయపడ్డారు. కాబట్టి ఎలాగోలా పైచేయి సాధించే ప్రయత్నంలో మున్ముందు దాడులను పుతిన్ మరింత తీవ్రతరం చేయొచ్చని అంచనా వేశారు. ఆ క్రమంలో రసాయన ఆయుధాల ప్రయోగానికి దిగే ఆలోచనలో ఉన్నారని మరోసారి ఆరోపించారు. తమ ఆర్థిక ఆంక్షలకు ప్రతీకారంగా అమెరికాపై రష్యా సైబర్ దాడులకు దిగొచ్చని ఆరోపించారు.
వీటిని రష్యా తీవ్రంగా ఖండించింది. అలాంటివి అమెరికా, పశ్చిమ దేశాలకే అలవాటని ఎద్దేవా చేసింది. అమెరికాతో సంబంధాలు కుప్పకూలే దశలో ఉన్నాయంటూ ఆ దేశ రాయబారిని పిలిచి నిరసన వ్యక్తం చేసింది. మరోవైపు, రష్యాపై ఆంక్షలు విధించేందుకు సెర్బియా నిరాకరించింది. ఈ విషయంలో పశ్చిమ దేశాలతో ఎప్పటికీ చేతులు కలపబోనని స్పష్టం చేసింది. రష్యా కుబేరులకు చెందిన 40 కోట్ల యూరోలను జప్తు చేస్తున్నట్టు నెదర్లాండ్స్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment