
వాషింగ్టన్ : ప్రతిరోజూ ఉదయం లేవగానే కాస్త అటూ ఇటూ నడిస్తే మీ గుండెకు వచ్చే ముప్పు తగ్గుతుందని మరోసారి తాజా అధ్యయనంలో వెల్లడైంది. రోజుకి 6 వేల నుంచి 9 వేల అడుగులు వేసే వారిలో గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం సగానికి సగం తగ్గిపోతోందని ఆ అధ్యయనం తెలిపింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కు చెందిన జర్నల్ సర్క్యులేషన్ తాజా అధ్యయనం వివరాలను ప్రచురించింది..ఆ అధ్యయనం ప్రకారం రోజుకి 9 వేల అడుగులు నడిచే వారిలో గుండె వ్యాధులు వచ్చే ముప్పు 40–50 శాతం తగ్గిపోతుంది.
మధ్య వయస్కులు రోజుకి 6 వేల నుంచి 9 వేల అడుగులు నడిస్తే గుండె సంబంధిత వ్యాధులు సోకే అవకాశం 50% తగ్గిపోతుంది. ఇక 60 ఏళ్ల వయసు పైబడిన వారు ఎంత ఎక్కువ నడిస్తే వారి గుండెకు అంత మంచిది. యుక్త వయసులో ఉన్న వారి గుండె ఆరోగ్యానికి, వారి నడకకు ఎలాంటి సంబంధమూ లేదు. నడకకి, గుండె ఆరోగ్యానికి మధ్య ఉన్న లింకుపై ఇప్పటివరకు జరిగిన ఎనిమిది అధ్యయనాల ఫలితాల్ని క్రోడీకరించి తాజా అధ్యయనాన్ని రూపొందించారు. 18 ఏళ్లకు పైబడిన వయసున్న వారు 20,152 మంది ఇందులో పాల్గొన్నారు. ఆరేళ్లపాటు వారి స్మార్ట్ వాచ్‌లు, ఫోన్‌ల్లో రికార్డయిన వివరాల ద్వారా తాజా అధ్యయనాన్ని రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment